Etela Rajender: అన్ని పార్టీల్లో సీఎం కేసీఆర్ కోవర్టులు.. బీజేపీ నేత ఈటల సంచనల వ్యాఖ్యలు

Kaburulu

Kaburulu Desk

January 25, 2023 | 05:51 PM

Etela Rajender: అన్ని పార్టీల్లో సీఎం కేసీఆర్ కోవర్టులు.. బీజేపీ నేత ఈటల సంచనల వ్యాఖ్యలు

Etela Rajender: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలలో సీఎం కేసీఆర్ కోవర్టులున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే ఎన్నికల కాలం.. పైగా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాల్సిన సమయం. అందుకే ఒక్కో నేత ఒక్కోలా పొలిటికల్ కామెంట్స్ చేసి రాజకీయాలలో వేడి పెంచుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచేస్తున్నాయి.

బీజేపీ నేత, హూజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన దగ్గర నుండే కేసీఆర్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఉద్యమ సమయం నుండి సమకాలీకులుగా మెలిగిన ఈటల, కేసీఆర్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో దూరమవుతూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. ఈటల టీఆర్ఎస్ ను వీడి రాజీనామా చేసి బీజేపీ నుండి గెలుపొందడం.. అప్పటి నుండి రాజేందర్ ఏది మాట్లాడినా అందులో కేసీఆర్ టార్గెట్ వ్యాఖ్యలు కనిపిస్తుంటాయి.

ఎప్పటి లాగానే ఈటల మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు సంబంధించిన వ్యక్తులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని.. వారు కోవర్టులుగా పని చేస్తూ లీకులిస్తున్నారని వ్యాఖ్యనించారు. 2018లో మా నియోజకవర్గంలో కేసీఆర్ కొందరు చిల్లర గాళ్లను పెట్టుకుండు.. డబ్బులిస్తే.. వాళ్లు నాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇస్తరు. 2018 ఎన్నికల్లో నా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేసీఆర్ డబ్బులు ఇచ్చిండు. నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు. కానీ నా ప్రజలు నా వెనుక నిలబడ్డరు. నాతో పాటు మరో 20 మందిని ఓడించే ప్రయత్నం చేసిండు. నాపై కొన్ని పత్రికల్లో కేసీఆర్ ఆసత్య వార్తలు రాయించిండు.

అంతేకాదు, కేసీఆర్ గారి మనుషులు అన్ని పార్టీలలో ఉంటరు. ఎవరికి తెలియకుండా ఇన్‌ఫార్మర్లను పెట్టుకుంటడు. వాళ్లే లీకులు ఇస్తుంటరు. వాళ్లే రాయిస్తుంటరు. ముద్దకు రానియ్రరు.. ముందుకు పోనియ్యరు. కేసీఆర్ తాను గొప్పగా ఎదిగే ప్రయత్నం చేయడు. ఇతర పార్టీలను బలహీనపరిచి తాను మాత్రమే ప్రత్యమ్నాయం అనే అనివార్యతను తీసుకొస్తడు. ఈ వెకిలి చేష్టలను కేసీఆర్ బంద్ చేసుకోవాలి అంటూ రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారాయి.