AP CM Jagan: సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన.. కారణం ఏంటి?

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 11:23 PM

AP CM Jagan: సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన.. కారణం ఏంటి?

AP CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన బాట పట్టనున్నారు. రేపు ఎల్లుండి అనగా సోమ, మంగళ వారాలు రెండు రోజులపాటు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెల 30, 31 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనుండగా.. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరి 6.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. వన్ జన్పథ్ నివాసంలో రాత్రికి బస చేస్తారు.

ఈ పర్యటనలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం జగన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ సమ్మిట్ సమావేశాలకు సీఎం జగన్ హాజరు కావడంతో పాటు.. కేంద్ర పెద్దలను కూడా కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరగనున్న జి-20 సన్నాహక సదస్సులో ఆయన పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈనెల 31న ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో దౌత్య వేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ సమ్మి ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ సారి సీఎం కీలక వ్యక్తులతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. కేంద్ర పెద్దలతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందు నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్‌‌రెడ్డిని సీబీఐ అధికారులు మొట్టమొదటిసారిగా ప్రశ్నించారు. శనివారం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు అవినాశ్‌‌రెడ్డిని ప్రశ్నించింది. ఈ కేసు అలా ఉండగానే సీఎం జగన్ ఢిల్లీ వెళ్తుండడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.