CM Jagan: సీఎం జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం చెప్పిన ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 08:58 PM

CM Jagan: సీఎం జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం చెప్పిన ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్

CM Jagan: సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ మంగళవారం ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఈ సమావేశానికి పలువురు దౌత్యవేత్తలు హాజరవుతుండగా.. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం జగన్ తో పాటు ఉన్నతాధికారులు కూడా ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆయన ఈ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

అయితే ఆయన ఎక్కిన ప్రత్యేక విమానం గాల్లోకి లేచిన కాసేపటికే మళ్ళీ అత్యవసరంగా అదే విమానాశ్రయం కిందికి దిగింది. ఎయిర్ పోర్టు నుంచి సాయంత్రం 5.03 గంటలకు టేకాఫ్ తీసుకోగా.. కొన్ని నిమిషాలకే అనగా సాయంత్రం 5.26 గంటలకు అత్యవసరంగా కిందికి దిగింది. సమస్య పరిష్కారం అవుతుందని, ఢిల్లీ వెళ్లాలని సీఎం జగన్ కాసేపు విమానాశ్రయంలోనే ఎదురుచూశారు. అయితే ఇప్పుడే పరిష్కరం అయ్యే అవకాశం కనిపించకపోవడంతో సీఎం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.

విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంపై గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మి కాంత్ రెడ్డి స్పందించారు. సాంకేతిక కారణాలతోనే విమానం వెనక్కి వచ్చిందని చెప్పారు. విమానంలోని ఏసీ వాల్స్ లో లీకేజీతో ప్రెజర్ తగ్గిందని.. ప్రతి విమానం బయల్దేరే టైంలో పూర్తిగా చెక్ చేస్తామని.. ఆ తర్వాతే టేకాఫ్ అవుతుందని.. ఏ చిన్న సమస్య ఉన్నా విమానాన్ని వెనక్కి తీసుకొస్తారని.. ఇది కూడా అలాగే వెనక్కు తీసుకొచ్చారని చెప్పారు. టెక్నీకల్ లోపం ఏ విమానంలో అయినా.. ఏ సమయంలో అయినా రావచ్చని వెల్లడించారు. కాగా, ఈ రాత్రికే ప్రత్యేక విమానంలో ఢిలీకి ముఖ్యమంత్రి బయలుదేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయానికి సీఎం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండడంతో ఈరాత్రికే ఆయన ప్రయాణం సాగించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు.