YSRCP: తాడేపల్లిలో సీఎం సంక్రాంతి సంబరాలు.. అంబటి డాన్సులు!

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 12:21 PM

YSRCP: తాడేపల్లిలో సీఎం సంక్రాంతి సంబరాలు.. అంబటి డాన్సులు!

YSRCP: భోగి పండగ సంబరాలు ఊరు వాడన అంబరాన్ని అంటుతున్నాయి. పిల్లా పాపలతో పల్లెలు సందడిగా మారగా.. యువతలో పండగా జోష్ మొదలయింది. ఇక.. ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే నేతలు కూడా రాజకీయాలను పక్కనపెట్టేసి పండగ సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ తన సతీమణి భారతీరెడ్డి‌తో కలిసి పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాల ఉట్టిపడేలా సీఎం సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సీఎం జగన్ దంపతులు తొలుత గోపూజ నిర్వహించగా.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు.. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలను తిలకించారు. సంక్రాంతి వేడుకల కోసం సీఎం జగన్ నివాస ఆవరణలో పల్లె వాతావరణాన్ని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా సెట్స్‌ను తీర్చిదిద్దారు.

ముందుగా ఉదయమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మన పల్లెలు ధాన్యాగారాలుగా, ఇంగ్లిషు విద్యకు నెలవుగా, ఆరోగ్యచికిత్సలకు కేంద్రంగా, మన పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సంక్రాంతిని అవి మరింత ద్విగుణీకృతం చేస్తాయని విశ్వసిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఇక.. సీఎం జగన్ తో పాటు మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నేతలు కూడా రాష్ట్రవ్యాప్తంగా భోగి పండగను ఘనంగా జరుపుకున్నారు. అయితే, మంత్రి అంబటి రాంబాబు బోగి సెలబ్రేషన్స్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లోమంత్రి అంబటి రాంబాబు ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేశారు. బంజారా మహిళలతో కలిసి మంత్రి అంబటి రాంబాబు హుషారుగా స్టెప్పులేశారు. ఆయన స్టెప్పులకు అక్కడున్నవారంతా పెద్దగా కేరింతలు కొట్టగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.