CM Jagan: తోడేళ్ళన్నీ ఒక్కటవుతున్నాయ్.. మీ బిడ్డ సింహంలాగే పోరాడతాడు!

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 05:01 PM

CM Jagan: తోడేళ్ళన్నీ ఒక్కటవుతున్నాయ్.. మీ బిడ్డ సింహంలాగే పోరాడతాడు!

CM Jagan: రాష్ట్రంలో తోడేళ్ళన్నీ ఒక్కటి అవుతున్నాయని.. మీ బిడ్డకి ఎలాంటి పొత్తులు ఉండవని.. సింహం సింగిల్ గానే పోరాడుతుందని సీఎం జగన్ సినిమా స్టైల్ లో డైలాగ్స్ చెప్పారు. పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించిన సీఎం.. జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారులకు నిధులను పంపిణీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 3,30,145 మందికి రూ 330.15 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. దీని ద్వారా ఒక్కో లబ్ది దారుడుకు రూ.10 వేల చొప్పున ఖాతాల్లో జమ కానున్నాయి.

ఈ రోజు అందిస్తున్న సాయంతో ఈ పథకం ద్వారా మూడేళ్ల కాలంలో ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున రూ.927.39 కోట్ల మేర లబ్ది చేకూరింది. కాగా.. ఈ వేదికపై మాట్లాడిన జగన్ ప్రతిపక్ష పార్టీల పొత్తులు, వచ్చే ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని.. తోడేళ్ళన్నీ ఒక్కటై వచ్చినా ప్రజలు ఇచ్చిన బలంతో వారిపై పోరాడుతానన్నారు. లంచాలు, వివక్ష లేని మీ బిడ్డ పరిపాలన కావాలా? లేదా గజదొంగల పరిపాలన కావాలా? మీరే తేల్చుకోండని అన్నారు.

తాను గజదొంగలను నమ్ముకోలేదని.. తాను తన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద ప్రజలను నమ్ముకున్నానని జగన్ పేర్కొన్నారు. మీ బిడ్డ ఒక్కడే సింహంలా పోరాడతాడు.. మీ కోసం పోరాడతాడని.. ప్రజల దీవెనలు తనపై ఉండాలని ఆయన కోరారు. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతోందంటూ కొందరు అబద్ధాలు చెబుతున్నారని.. గతంలో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్ వుండేదని.. గతంతో పోలిస్తే అప్పుల వృద్ధి ఇప్పుడు తక్కువే ఉందన్నారు.

మీ బిడ్డ ప్రభుత్వంలో డీబీడీ ద్వారా నిధులు ఇస్తుంటే.. గత ప్రభుత్వంలో డీపీటీ ద్వారా ఇచ్చేవారన్నారు. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని ఎద్దేవా చేశారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గజదొంగల ముఠా అని.. ఇది పేదవాడికి, పెత్తందారుకి మధ్య నడుస్తున్న యుద్ధమన్నారు. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఓ వైపు.. వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నారన్నారు.