AP News: చింతమనేని అరెస్ట్.. జోగయ్యకు పవన్ ఫోన్.. ఏలూరులో ఉద్రిక్తత!

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 03:45 PM

AP News: చింతమనేని అరెస్ట్.. జోగయ్యకు పవన్ ఫోన్.. ఏలూరులో ఉద్రిక్తత!

AP News: మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కాపు రిజర్వేషన్ల కోసం సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆదివారం రాత్రి పోలీసులు ఆయన్ను బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆయన ఆసుపత్రి నుండి దీక్షను కొనసాగిస్తున్నారు. 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్షకి దిగడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.

కాగా, ఆసుపత్రిలో దీక్షకు దిగిన హరిరామజోగయ్యను టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించేందుకు వచ్చారు. కానీ.. ఆయన్ను అనుమతించని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. దీంతో ఆస్పత్రి వద్ద చింతమనేని అనుచరులు, టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. వైసీపీ ప్రభుత్వం సామాన్యుల హక్కులను కాలరాస్తోందని.. పరామర్శకి వచ్చిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు హరిరామజోగయ్యను పరామర్శించేందుకు వచ్చిన కాపు సంక్షేమ సమితి నేత ఆదిశేషును కూడా పోలీసులు అరెస్టు చేసి త్రీటౌన్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఆయన అనుచరులు కూడా జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేక నినాదాలు చేశారు. ముందు అసలు ఆసుపత్రిలో ఏం జరుగుతుందో చెప్పాలని.. జోగయ్య ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, కాపు రిజర్వేషన్ల సాధన కోసం దీక్షకు దిగిన మాజీ మంత్రి హరిరామజోగయ్యకు జనసేన అధినేత పవన్ కల్యా ణ్ ఫోన్ చేసి పరామర్శించారు. జోగయ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న పవన్.. ఆయన ఆమరణ దీక్షపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరపాలని పవన్ కోరారు. ఒకవైపు ఆసుపత్రిలో జోగయ్య దీక్ష.. మరోవైపు పరామర్శకు వచ్చిన నేతల అరెస్ట్ తో ఆసుపత్రి పరిసరాలు ఆందోళనకరంగా మారాయి. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.