NIA Court: కోడి కత్తి కేసు.. జగన్ కూడా కోర్టుకు హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశం

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 04:09 PM

NIA Court: కోడి కత్తి కేసు.. జగన్ కూడా కోర్టుకు హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశం

NIA Court: అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతపై విమానాశ్రయంలో ఈ దాడి జరగడం.. అది రాజకీయంగా రగులుకోవడం.. అక్కడి నుండి ఆసక్తికర మలుపులు తీసుకుంది. సరిగ్గా ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ కోడికత్తి దాడి వైసీపీకి సానుభూతిపరంగా కూడా ఉపయోగపడింది. ఈ కోడికత్తి కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది.

ఎన్నికల అనంతరం నత్తనడకన ఉన్న ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్‌ను విచారణకు రావాలని ఇటీవలే ఎన్ఐఏ కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే, ఆయన విచారణకు హాజరు కాలేదు. మంగళవారం విచారణ సందర్భంగా కోర్టు ఈ కేసులో కీలక ఆదేశాలను జారీ చేసింది. కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. విచారణకు నిందితుడు శ్రీనివాస్ తో పాటు బాధితుడు జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది.

అయితే, మొదటి సాక్షి తండ్రి మరణించడంతో కోర్టుకు హాజరు కాలేకపోయారని న్యాయవాది తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది కోర్టు. కాగా, కేసులో బాధితుడి షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపిన కోర్టు.. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత ఈ కేసు మరోసారి తెరపైకి రావడం.. నిందితుడు శ్రీనివాస్‌ విచారణకు హాజరవగా, సాక్షి హాజరుకాకపోవడం.. బాధితుడు జగన్ ను కూడా హాజరు పరచాలని కోర్టు ఆదేశించడంతో మరోసారి ఈ కేసు హైలెట్ అవుతుంది.