Cheddi Gang: అమ్మో చెడ్డీ గ్యాంగ్.. తెలంగాణలో మళ్ళీ వరస చోరీలు

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 12:07 PM

Cheddi Gang: అమ్మో చెడ్డీ గ్యాంగ్.. తెలంగాణలో మళ్ళీ వరస చోరీలు

Cheddi Gang: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. జిల్లా కేంద్రంలో వరస చోరీలతో చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురిచేశారు. స్థానిక బృందావన్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తిస్తున్నారు. గతంలో అదే కాలనీలో చెడీ గ్యాంగ్ చోరీకి ప్రయత్నించి విఫలమై వెనుతిరిగగా.. నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం దోపిడీ చేశారు.

చెడ్డీ గ్యాంగ్ అంటేనే చోరీలతో హడలెత్తించడంతో పాటు మారణాయుధాలతో దాడులు చేస్తారనే భయంతో మహబూబ్ నగర్ వాసులకి కంటి మీద కునుకు ఉండడంలేదు. రాత్రి పూట ఇళ్లలో చాకచక్యంగా చొరబడి డబ్బు, నగలు దోచుకొనే చెడ్డీ గ్యాంగ్ అడ్డమొస్తే ఎంతటి ఘాతుకానికైనా పాల్పడతారని మహబూబ్ నగర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే మళ్ళీ వచ్చేవరకు ఇల్లు సురక్షితంగా ఉంటుందా ఉండదా అని జంకుతున్నారు.

చెడ్డీ గ్యాంగ్ పై బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టారు. దొంగతనానికి వచ్చిన చెడ్డి గ్యాంగ్ వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అవగా వాటిని విడుదల చేసి ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు. మీ ప్రాంతాలలో అనుమానితులుగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని కోరుతున్నారు. అలాగే తాళం వేసి ప్రయాణాలకు వెళ్లేప్పుడు పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని కోరుతున్నారు.

గత ఏడాది కూడా తెలంగాణలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ సంచరించడం కలకలం రేపింది. మీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో 12 తులాల బంగారం ఎత్తుకెళ్లిన చెడ్డీ గ్యాంగ్ దొంగలు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో సంచరించడం కలకలం రేపింది. ఈ ప్రాంతాన్ని అప్పుడు పోలీసులు జల్లెడ పట్టడంతో కనుమరుగయ్యారు.

పట్టణంలోని పరిగి రోడ్డులో ఉన్న మైహోం వెంచర్‌లో ఓ ఇంటి సమీపంలో నలుగురు సభ్యులు ఉన్న ముఠా చేతిలో మారణ ఆయుధాలతో సంచరించడం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారు చెడ్డి గ్యాంగ్ గా గుర్తించి స్థానికులను అప్రమత్తం చేశారు. ఇప్పుడు మళ్లీ మహబూబ్‌ నగర్‌ లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌ చల్‌ చేస్తుండటంతో.. ఈ గ్యాంగ్ ఏడాది నుండి తెలంగాణలోనే సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.