TDP-YSRCP: టీడీపీ శ్రేణుల ‘చలో గన్నవరం’.. గన్నవరంలో పోలీస్ 144 సెక్షన్!

Kaburulu

Kaburulu Desk

February 21, 2023 | 01:17 PM

TDP-YSRCP: టీడీపీ శ్రేణుల ‘చలో గన్నవరం’.. గన్నవరంలో పోలీస్ 144 సెక్షన్!

TDP-YSRCP: కృష్ణాజిల్లా గన్నవరంలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య మంటలు ఇంకా చల్లారలేదు. టీడీపీ నుండి గెలిచి వైసీపీకి సానుభూతిపరుడిగా మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దానికి కౌంటర్ గా టీడీపీ నేతలు వంశీపై తీవ్ర విమర్శలకు దిగడంతో మొదలైన ఈ రగడ వంశీ టీడీపీ ఆఫీసుపై దాడి వరకు కొనసాగింది.

సోమవారం వంశీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపై దాడి చేసి కారును, ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ మంటలు అలా కొనసాగుతుండగానే ఎమ్మెల్యే వంశీ ఈరోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననుండడం.. మరోవైపు టీడీపీ నేతలు చలో గన్నవరంకు పిలుపునివ్వడంతో పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను గన్నవరంలోకి వెళ్లనివ్వకుండా 144 సెక్షన్ విధించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా హెచ్చరించారు. ఈరోజు టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. గన్నవరంకి 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో వున్నాయని ఎస్పీ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలులేదని.. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్‌పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.

పోలీస్ నిర్ణయాన్ని కాదని ఎవరైనా అక్రమంగా గన్నవరంలోకి ప్రవేశించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని ఎస్పీ జాషువా కోరారు. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించి సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద టీడీపీ నేత పట్టాభి దాడికి పురిగొల్పారని, బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం వల్లే శాంతిభద్రతల సమస్య వచ్చిందని ఎస్పీ ఆరోపించారు. పట్టాభి తొందర పాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వలనే శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించారు.