Padma Awards 2023: 106 పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. 12 మంది తెలుగు వారు వీరే

Kaburulu

Kaburulu Desk

January 26, 2023 | 08:58 AM

Padma Awards 2023: 106 పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. 12 మంది తెలుగు వారు వీరే

Padma Awards 2023: దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 ఏడాదికి గాను 106 పద్మ అవార్డులను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదించగా.. ఈ జాబితాలో 6 పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్ మరియు 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు, ఏడుగురు మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. ఇక, మన తెలుగు రాష్ట్రాలలో ఏపీ నుండి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ పురస్కారం దక్కిన వారిలో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం ఐదుగురు పద్మ పురస్కారాలను అందుకోగా.. వీరిలో ఇద్దరిని పద్మ భూషణ్, ముగ్గురిని పద్మ శ్రీ వరించింది. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి, కమలేశ్ డి.పటేల్ (ఆధ్యాత్మికం, ధ్యానం)కు పద్మ భూషణ్ పురస్కారం లభించగా.. బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య), ఎం.విజయగుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం), పసుపులేటి హనుమంతరావు (వైద్యం)లను పద్మ శ్రీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక, ఏపీలో ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. కీరవాణి, గణేశ్‌ నాగప్ప కృష్ణరాజనగర, సీవీ రాజు, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, కోటా సచ్చితానంద, ప్రకాశ్‌చంద్ర సూద్‌, సంకురాత్రి చంద్రశేఖర్‌ను పద్మశ్రీ వరించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు), కోట సచ్చిదానంద శాస్త్రి (కళలు‌), సీవీ రాజు (కళలు), గణేశ్‌ నాగప్ప కృష్ణరాజనగర (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌), సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ), ప్రకాశ్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య విభాగం)కు పద్మశ్రీలు దక్కాయి.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు.. సమతామూర్తి విగ్రహ రూపశిల్పి చినజీయర్ స్వామికి కేంద్రం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించగా.. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ఫుల్ నెస్ మేడిటేషన్ గైడ్ గా, హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్, హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా, సహజ్ మార్గ్ స్పిరిచ్యువాలిటీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ప్రఖ్యాత ధ్యాన గురువు, శ్రీరామ్ చంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ కు కేంద్రం పద్మ భూషణ్ అవార్డు
ప్రకటించింది. మిగతా తెలుగు వారికి పద్మశ్రీలను ప్రకటించింది.