YS Jagan: ఏపీ రాజధాని విశాఖనే.. నేను కూడా షిఫ్ట్ అవుతున్నా.. సీఎం జగన్ సంచలన కామెంట్స్!

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 01:51 PM

YS Jagan: ఏపీ రాజధాని విశాఖనే.. నేను కూడా షిఫ్ట్ అవుతున్నా.. సీఎం జగన్ సంచలన కామెంట్స్!

YS Jagan: ఒకపక్క కోర్టు వివాదాలు, ప్రతిపక్షాల పోరాటాలు, రాజధాని తరలింపు వ్యతిరేక ఉద్యమాలు, నిరసనలు సంగతెలా ఉన్నా ఈ సారి రాజధాని విశాఖ వెళ్లిపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గత మూడేళ్లుగా ఇదిగో, అదిగో అంటూ సాగుతున్న ప్రచారాన్ని నిజం చేసేందుకు సీఎం రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు, మంత్రులే ఈ విషయంపై ప్రకటనలు చేస్తే.. ఈసారి ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డే సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ రాజధాని విశాఖనే.. నేను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నా అంటూ సంచలన ప్రకటన చేశారు.

మంగళవారం ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో మాట్లాడిన సీఎం జగన్.. త్వరలోనే విశాఖ ఏపీ కాపిటల్ కాబోతుందని సీఎం జగన్ ప్రకటించారు. తాను కూడా అక్కడికి షిఫ్ట్ కాబోతున్నానని వివరించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తలను విశాఖకు ఆహ్వానిస్తున్నామని.. ఏపీ 12% వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు.

అంతేకాదు, విశాఖలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని.. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుందని.. బహుశా మార్చి నెలలో రాజధాని తరలింపు ఉంటుందని.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నానని.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా.. అంటూ సీఎం జగన్ వెల్లడించారు.

మొత్తానికి ఈ వ్యాఖ్యలను చూస్తే సీఎం జగన్ తాను అనుకున్న కార్యాచరణ అమలు చేయడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది. మూడేళ్లకు పైగా ఊగిసలాటలో ఉన్న రాజధాని వ్యవహారంలో తన ఆలోచనల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి సిద్ధమవుతున్న జగన్.. ఇందులో న్యాయపరమైన చిక్కులు, వివాదాలతో సంబంధం లేని విధంగా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు కనిపిస్తుంది.