Hyderabad: కూకట్‌పల్లిలో ఒకేసారి 16 ఇళ్లలో చోరీ.. హడలెత్తిపోతున్న ప్రజలు

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 03:31 PM

Hyderabad: కూకట్‌పల్లిలో ఒకేసారి 16 ఇళ్లలో చోరీ.. హడలెత్తిపోతున్న ప్రజలు

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒకవైపు చైన్ స్నాచింగ్ లు, మరోవైపు చోరీలు హడలెత్తిస్తున్నాయి. నగరంలో అంతకంతకు క్రైమ్ రేట్ గణనీయంగా పెరుగుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒకవైపు దొంగతనాలు, హత్యలు, యాక్సిడెంట్లు, అత్యాచారాల వంటి ఘటనలు నిత్యకృత్యమవగా.. మరోవైపు డ్రగ్స్ రాకెట్స్ బయటపడుతుండడంతో అసలేం జరుగుతుంది హైదరాబాద్ లో అన్నది అంతు చిక్కడం లేదు.

నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకొచ్చి శిక్షలు విధిస్తుంది. నేరం ఎలాంటిదైనా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుంటున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా నిందితుల్లో మార్పు రావడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒకేసారి 16 ఇళ్లలో చోరీలు ఆందోళన కలిగిస్తున్నాయి. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు వరస దొంగతనాలకు పాల్పడడం సంచలనంగా మారాయి.

కూకట్ పల్లిలోని దయార్ నగర్, దేవీ నగర్ లలో తాళం వేసి ఉన్న ఇళ్ళనే టార్గెట్ గా చేసుకొని దొంగలు ఒకేసారి 16 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తుపట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడి ఉంటారని భావిస్తున్న పోలీసులు.. వరుస దొంగతనాలకు పాల్పడింది అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన వాళ్ళేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంటికి తాళం వేసి వెళ్లేప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కానీ, పోలీస్ నిఘా సరిగ్గా లేకపోవడంతోనే దొంగలు రెచ్చిపోతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ కాలనీల్లో పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ఈనెలలో దొంగలు భీభత్సం సృష్టించడం ఇలా మొదటి సారి కాదని ఇలా నగరంలో వేరు వేరు చోట్ల దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.

నగరంలో ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు ఉన్నా.. దొంగలు వరస చోరీలకు పాల్పడడం పోలీసులకు సవాల్‌ గా మారింది. ఎక్కడిక్కడ కేసులను ఛేదించి శిక్షలు విధిస్తున్నా కొత్త దొంగలు పుట్టుకొస్తున్నారు. గత నెలలో వరస చైన్ స్నాచింగ్ కలకలం రేపగా.. ఈనెలలో వరస చోరీలు నగర ప్రజలకు కలవరపాటుగా మారింది.