AP Budget Sessions: ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్ సమావేశాలు.. మరో రెండు కీలక ప్రకటనలు?

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 01:09 PM

AP Budget Sessions: ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్ సమావేశాలు.. మరో రెండు కీలక ప్రకటనలు?

AP Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కసరత్తు చేస్తోంది జగన్ సర్కార్. ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఫిబ్రవరి చివరి వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం సుమారు 22 పని దినాలు ఉండేలా సమావేశాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఒకవేళ ఫిబ్రవరిలో అసెంబ్లీలో సమావేశాలు కుదరకపోతే కనుక మార్చి 3, 4న విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌, ఆ తర్వాత మార్చి 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు నిర్వహించనుండటంతో ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని చెబుతున్నారు. కాగా, ఇటు బడ్జెట్ సమావేశాలలోనే ఏపీ ప్రభుత్వం మరో రెండు కీలక ప్రకటనలు కూడా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

అందులో ఒకటి విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు. ఇప్పటికీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్తున్న జగన్ సర్కార్ ఏది ఏమైనా పరిపాలన రాజధానిని విశాఖకు తరలించాలని సరైన సమయం కోసం చూస్తుంది. ఈ నెలాఖరున దీనిపై కోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో తీర్పు ఎలా ఉన్నా విశాఖకు పరిపాలన రాజధాని తరలింపుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను దారులకు జీతాలు, పింఛన్‌, డీఏ బకాయిలు వంటి సమస్యలపైనా ఈ సమావేశాలలోనే ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, ఈ సమావేశాల సమయంలోనే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా మార్చి మొదటి లేదా రెండో వారంలో ఎన్నికల ప్రకటన వెలువడనుంది. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ సమావేశాలు ఏపీ రాజకీయాలతో గట్టిగా ముడిపడి ఉండడంతో మరింత ఆసక్తిగా కనిపిస్తున్నాయి.