BRS Party: నాందేడ్‌లో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. పార్టీలోకి ‘మహా’ చేరికలు

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 09:36 AM

BRS Party: నాందేడ్‌లో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. పార్టీలోకి ‘మహా’ చేరికలు

BRS Party: దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎంతో పాటు పలు రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలోసైతం వారు పాల్గొని ప్రసంగించారు.

కాగా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకు ఆనుకొని ఉన్న రాష్ట్రాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ముందుగా మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా నేడు మహరాష్ట్రలోని నాందేడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. నాందేడ్ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో గురుద్వారా సచ్ ఖండ్ బోర్డు మైదానంలో బీఆర్ఎస్ సభను నిర్వహించనున్నారు.

సీఎం కేసీఆర్ హాజరుకానున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా జనాన్ని తరలిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవ్యేక్షించి.. సభకు హాజరయ్యే వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

బీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత రెండో సభ కాగా పార్టీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మధ్నాహ్నం కేసీఆర్ నాందేడ్ చేరుకోనుండగా ఈ సభ కోసం సర్వం సిద్ధం చేశారు. నాందేడ్‌ పట్టణం, ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. సభ అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో కూడా పాల్గొననుండగా.. ఈ సమావేశంలో మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో బీఆర్ఎస్ విధివిధానాలపై కేసీఆర్ మాట్లాడనున్నారు. మరోవైపు మహారాష్ట్ర నుండి భారీగా నేతల చేరికలు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.