BRS Party: గవర్నర్ వ్యాఖ్యలపై.. మూకుమ్మడి దాడి మొదలు పెట్టిన బీఆర్ఎస్ నేతలు

Kaburulu

Kaburulu Desk

January 26, 2023 | 04:22 PM

BRS Party: గవర్నర్ వ్యాఖ్యలపై.. మూకుమ్మడి దాడి మొదలు పెట్టిన బీఆర్ఎస్ నేతలు

BRS Party: తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సైకు మధ్య వైరం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సాక్షాత్తు హైకోర్టు ఈ వేడుకలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా సీఎం నుండి స్పందన రాలేదు. కాగా.. రిపబ్లిక్ వేడుకలలో గవర్నర్ తమిళిసై కొందరికి నేను నచ్చకపోవచ్చు కానీ.. కానీ తెలంగాణ అంటే అభిమానం అంటూ పరోక్షంగా ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్ పరోక్షంగా వ్యాఖ్యానించిన.. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రత్యక్షంగానే మాటల దాడి మొదలు పెట్టారు. ట్విటర్ వేదికగా స్పందించిన సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత.. గవర్నర్ మాట్లాడిన వీడియోను జత చేసి ‘కరోనా లాంటి అత్యంత క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే.. దేశ మౌళిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేవలం కొందరి సంపద పెంపు కోసం దృష్టి పెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాం. రిపబ్లిక్ డే లాంటి ప్రత్యేక రోజున సీఎం కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ మీరు అడిగినందుకు ధన్యవాదాలు’ అని కవిత ట్వీట్ చేశారు.

ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ఆ విధంగా మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు. భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, డీజీపీని పక్కన పెట్టుకొని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత బాధ్యతలో ఉన్న వాళ్ళు తెలంగాణ అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలవుతుందని.. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారు కేంద్రం ఏం చేస్తుందో కూడా చెప్పాల్సి ఉందన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని, మైకులు దొరకగానే ఆరోపణలు చేయొద్దని వ్యాఖ్యానించారు. గవర్నర్ పై బీఆర్ఎస్ నేతల కామెంట్స్ ఇప్పుడు రాజకీయాలలో వేడి పెంచుతున్నాయి.