BRS-JD(S): జేడీఎస్ తరపున కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రచారం.. అంటే పోటీ లేనట్లేనా?

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 01:37 PM

BRS-JD(S): జేడీఎస్ తరపున కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రచారం.. అంటే పోటీ లేనట్లేనా?

BRS-JDS: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర మంత్రులు కూడా జేడీఎస్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారట. మంత్రి సత్యవతి రాథోడ్ ఈ మేరకు ఓ కార్యక్రమంలో వెల్లడించారు. కర్ణాటకలోని కలబురిగిలో జేడీఎస్ గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ కర్ణాటక ఎన్నికలలో సీఎంతో పాటు మరికొందరు మంత్రులు కూడా జేడీఎస్ తరపున ప్రచారం చేస్తారని వెల్లడించారు.

ఇక్కడ మాట్లాడిన మంత్రి సత్యవతి.. అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తమది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే బీజేపీ రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి చేయడంలో దారుణంగా విఫలమైందన్నారు. తెలంగాణలో తాము రూ. 2,016 చొప్పున పింఛను ఇస్తుంటే కర్ణాటకలో మాత్రం ఇప్పటికీ రూ. 600 ఇస్తున్నారని సత్యవతి రాథోడ్ విమర్శించారు. అయితే.. సత్యవతి బీజేపీపై చేసిన విమర్శల సంగతెలా ఉన్నా కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందన్న విషయంగా మాత్రం ఆసక్తిగా మారింది.

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఉద్దేశ్యం కన్నా.. బీజేపీని ఢీ కొట్టాలనే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. ముందుగా దక్షణాదిలో ఏపీ, కర్ణాటక, తమిళనాడుతో సహా.. మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తృతం కోసం ప్రయత్నాలు కూడా మొదలైనట్లు రాజకీయ వర్గాలలో ఉన్న టాక్. ఈ మేరకు ఇప్పటికే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా పార్టీ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఏపీలో పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసిన కేసీఆర్ త్వరలోనే పార్టీ కమిటీలను కూడా సిద్ధం చేస్తున్నారు.

ఇక, మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీ చేయదని ఖరారైనట్లే కనిపిస్తుంది. మంత్రి సత్యవతి చెప్పిన దాని ప్రకారం బీఆర్ఎస్ కర్ణాటకలో జేడీఎస్ కు మద్దతు ఇచ్చి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడడం.. కేసీఆర్ కు జేడీఎస్ పార్టీతో దగ్గర సంబంధాలుండడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఇక్కడ పోటీచేస్తే ప్రతిపక్ష ఓటు చీలి.. బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది.