BRS Party: ఏపీలో బీఆర్ఎస్ భారీ సభ.. ప్రగతి భవన్‌లో సన్నాహాలు

Kaburulu

Kaburulu Desk

January 5, 2023 | 08:40 AM

BRS Party: ఏపీలో బీఆర్ఎస్ భారీ సభ.. ప్రగతి భవన్‌లో సన్నాహాలు

BRS Party: నో డౌట్ సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలు ఆషామాషీగా కాదు. సంక్రాంతి తర్వాత ఆయన చెప్పినట్లుగానే ఉరుకులు పరుగులు ఉండేలా కనిపిస్తుంది. పార్టీని జాతీయస్థాయిలో విస్తరించే క్రమంలో ఉన్న కేసీఆర్.. ముందుగా పక్క రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగా మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం
నిర్ణయించినట్లు తెలుస్తుంది.

అది కూడా ఏదో ఫార్మాలిటీకి కాదు భారీ స్థాయిలో ఈ సభ నిర్వహించనున్నారట. దీనికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, ఆ పార్టీ నేత చింతల పార్థసారథిలు బుధవారం ప్రగతిభవన్ లో కేసీఆర్ తో భేటీ అయి చర్చించారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణ, పటిష్ఠ నిర్మాణంపై చర్చించారు. ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ మార్గదర్శనం చేసినట్లు తెలుస్తుంది.

ఏపీలో పార్టీ విస్తరణలో భాగంగా భారీఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, నిర్మాణాత్మక వైఖరితో ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలన్నారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీల రూపకల్పన చేయాలని కేసీఆర్ చెప్పారు. త్వరలో సభా వేదిక, నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నట్లు ఏపీ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ప్రజల్లోకి ప్రబలంగా తీసుకెళ్లాలని కేసీఆర్ ఈ సందర్భంగా ఏపీ బీఆర్ఎస్ నేతలకు సూచించగా.. కేసీఆర్ నిర్దేశాల మేరకు ఏపీలో బీఆర్ఎస్ ముందుకు సాగుతుందన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉన్న మాట నిజమేనని.. ఇప్పటికే పలువురు సంప్రదిస్తున్నారని.. రానున్న రోజులలో పెద్దఎత్తున చేరికలుంటాయని చెప్పారు. జస్ట్ మొన్న ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంతోనే ఏపీలో అధికార పార్టీ నేతలు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇక సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు? దానికి ఏపీ నేతల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.