K.A.Paul: తమ్ముడూ పవన్ నా పార్టీలోకి రా.. జనసేనానికి పాల్ బంపర్ ఆఫర్

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 01:15 PM

K.A.Paul: తమ్ముడూ పవన్ నా పార్టీలోకి రా.. జనసేనానికి పాల్ బంపర్ ఆఫర్

K.A.Paul: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ రాజకీయాలను వదిలేయాలని.. లేదంటే తన పార్టీలో చేరాలని పాల్ ప్రకటించారు. అప్పుడప్పుడు పాల్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండే సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ జనసేన అధ్యక్షుడిపై పాల్ చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంటుంటాయి.

కాగా, మరోసారి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేఏ పాల్ ఏపీ రాజకీయాలపై స్పందించారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని, ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని కేఏ పాల్ అన్నారు. పవన్ ఎందుకు ఓట్లు చీల్చుతున్నాడో చెప్పాలని కేఏ పాల్ నిలదీశారు. పవన్ రాజకీయాల నుంచి తప్పుకుంటేనే మేలని కేఏ పాల్ సలహా ఇచ్చారు.

ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకోకపోతే తమ ప్రజాశాంతి పార్టీలోకి రావాలని పవన్ కు ఆహ్వానం పలికారు కేఏ పాల్. ఇప్పటికే చంద్రబాబు, జగన్, మోడీని చూసిన పవన్ సీఎం అవ్వనని చెప్పారు. ఆయనే ఫెయిలుర్ నాయకుడని చెప్పాడని చురకలు అంటించిన పాల్.. ఎందుకు ఓటు వేస్ట్ చేస్తారు.. ప్రజాశాంతి పార్టీకి ఓటేసి ప్రపంచ శాంతికి దోహదపడాలని కోరారు. ఇక ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై కూడా స్పందించిన పాల్.. డబ్బుల కోసం తోట చంద్రశేఖర్ వంటి వారు బీఆర్ఎస్ లో చేరుతున్నారని విమర్శించారు.

ఇక ఏపీ సర్కారు తీసుకువచ్చిన జీవో నెం.1ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించిన కేఏ పాల్.. అది ప్రాణాలు కాపాడే జీవో అని పేర్కొన్నారు. మూడేళ్ల కిందటే రావాల్సిన జీవో అని, ఇప్పటికి వచ్చిందని అన్నారు. అయితే, దీన్ని న్యాయస్థానం సస్పెండ్ చేయడం పట్ల కేఏ పాల్ విచారం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసింది న్యాయమూర్తే అయినా తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు కేఏ పాల్. వైసీపీ నేతలు ఇరుకు సందుల్లో పెట్టినా తాను అడ్డుకుంటానని కేఏ పాల్ స్పష్టం చేశారు.