Raghunandan Rao: బీజేపీ మరో టార్గెట్.. సీఎస్ లాగా డీజీపీ కూడా వెళ్లాల్సిందే!

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 05:56 PM

Raghunandan Rao: బీజేపీ మరో టార్గెట్.. సీఎస్ లాగా డీజీపీ కూడా వెళ్లాల్సిందే!

Raghunandan Rao: తెలంగాణ బీజేపీ మరో కొత్త అంశంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. మొన్నటి వరకు తెలంగాణ సీఎస్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ ను కొన్నిరోజుల కిందట ఏపీ క్యాడర్ కు పంపించేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే తరహాలో కొందరు ఉన్నతాధికారులు సొంత క్యాడర్ లో కాకుండా, తెలంగాణలో కొనసాగుతున్నారని.. వారందరినీ తిరిగి ఏపీకి పంపించాలని బీజేపీ అటాక్ మొదలు పెట్టింది.

ఈ అంశంపై రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఎమ్మెల్యే రఘునందన్ రావు.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను కూడా సోమేశ్ కుమార్ తరహాలో వెంటనే ఏపీ క్యాడర్ కు బదిలీ చేయాలని కోరారు. తెలంగాణలో ఉన్న ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పీఎంవోకు ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఉన్నత సర్వీసుల అధికారులు ఎక్కడ పోస్టింగులు లభిస్తే అక్కడికి వెళ్లి పనిచేయాలని సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెబుతోందని అన్నారు.

అయితే, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) అండతో ఏపీకి కేటాయించిన అధికారులు కొందరు తెలంగాణలో.. తెలంగాణకు కేటాయించిన వారు కొందరు ఏపీలో కొనసాగుతున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని రఘునందన్ రావు టార్గెట్ చేస్తున్నారు. రఘునందన్ రావు ఆరోపణల ప్రకారం చూస్తే.. మాజీ సీఎస్ సోమేష్ సహా దాదాపు 15 మంది అధికారులు ఇలా ఉన్నారు.

డీజీపీ అంజనీకుమార్, రోనాల్డ్ రోస్జీ, అనంతరాములు, ఆమ్రపాలి తదితరులు ఈ జాబితాలో ఉండగా ఇప్పుడు వీరంతా వారికి కేటాయించిన క్యాడర్ కు వెళ్లాలని బీజేపీ నేతలు చెప్తున్నారు. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ డీవోపీటీ 2017లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సోమేష్ కేసును లీడ్ కేసుగా స్వీకరించిన హైకోర్టు ఇటీవల ఆయనను ఏపీకి వెళ్లాల్సిందేనని తీర్పును ఇచ్చింది.

ఇక, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారంపై హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇవ్వబోతోంది. ఏపీకి వెళ్లాలని హైకోర్టు తీర్పు ఇస్తే మాత్రం.. అందరూ ఏపీకి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే.. ఒకే నెలలో సీఎస్, డీజీపీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడం దేశంలో ఇదే తొలిసారి అవుతుంది. మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో.. ఏం జరుగుతుందో చూడాలి.