Khammam: బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు.. మోడీ కౌంట్ డౌన్ స్టార్ట్!

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 04:59 PM

Khammam: బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు.. మోడీ కౌంట్ డౌన్ స్టార్ట్!

Khammam: జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు పలువురు జాతీయ నేతలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన కేరళ సీఎం పినరయి విజయన్.. ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారిందని అన్నారు.

తెలంగాణ చేపడుతున్న అభివృద్ధిపై ప్రశంసలు కురిపించిన విజయన్.. కేసీఆర్‌ చేపట్టిన పోరాటాలకు మా మద్దతు ఉంటుందన్నారు. ఇవాళ కేంద్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. దేశ సమగ్రతను, న్యాయాన్ని, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది. బీజేపీ హయాంలో దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో పడింది. రాష్ట్రాల సమ్మేళనమే దేశం. ఫెడరల్‌ స్ఫూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదు. రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం కాలరాస్తోందని విమర్శించారు.

సంస్కరణల పేరుతో కేంద్రం నైతిక విధానాలను ఆచరిస్తోందని.. దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారని మండిపడ్డారు. మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. న్యాయ వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మోడీ కార్పొరేటర్లకు తొత్తుగా మారారు. మోడీ పాలనలో ఫెడరల్‌ స్ఫూర్తి దెబ్బతింటోంది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పారు. ఇలాంటి పార్టీలను ఏకతాటిపైకి తెచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అటు కేంద్రానికి కౌంటు డౌన్ మొదలైందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బిజెపి ఇతర రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుందన్నారు. విపక్ష పార్టీల నేతలను కేసులపేరుతో ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని అన్నారు.

మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని చూస్తుందని అఖిలేష్ ఆరోపించారు. నరేంద్ర మోడీకి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చేతులెత్తేసారని మండిపడ్డారు. రైతులని ఆదుకుంటామని చెప్పి మాట తప్పారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రక్షాళన జరుగుతున్నట్లే యూపీలోను జరుగుతుందన్నారు అఖిలేష్ యాదవ్. కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు.