iNCOVACC: భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే..?

Kaburulu

Kaburulu Desk

January 26, 2023 | 04:49 PM

iNCOVACC: భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే..?

iNCOVACC: ఇప్పటి వరకు కరోనాకు సూది మందు ద్వారానే వ్యాక్సిన్ ఉన్న సంగతి తెలిసిందే. మూడు, నాలుగు కంపెనీల వ్యాక్సిన్లు ఉన్నా.. అందులో హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కొవాగ్జిన్ తీసుకొచ్చింది. కాగా, ఇప్పుడు అదే కంపెనీ ముక్కు ద్వారా తీసుకొనే నాజల్ వ్యాక్సిన్ ను కూడా తీసుకొచ్చింది. దీంతో నేటి నుండి ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులోకి వచ్చినట్లయింది.

భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ ‘ఇంకోవాక్’ వ్యాక్సిన్ ను గురువారం కేంద్ర మంత్రులు మన్సుక్ మాండవీయ, జితేంద్ర సింగ్ ప్రారంభించారు. గతేడాది నవంబర్లోనే ఈ టీకా వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. నాజల్ వ్యాక్సిన్ ను 18 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోసుగా అందించేందుకు పచ్చ జెండా ఊపింది. కొవిన్ ప్లాట్ ఫామ్ లో కూడా ఈ వ్యాక్సిన్ ను చేర్చారు. దీంతో ఇకపై ప్రజలందరికీ ఈ టీకా అందుబాటులో ఉండనుంది.

ఇప్పటికే కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు ఈ నాజల్ వ్యాక్సిన్ ‘ఇంకొవాక్’ బూస్టర్ గా తీసుకోవచ్చు. ‘బీబీవీ154’గా పిలిచే ఈ నాజల్ వ్యాక్సిన్ ‘ఇంకొవాక్’ బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రపంచంలో రెండు డోసుల్లో ముక్కు ద్వారా తీసుకునే మొట్టమొదటి ప్రాథమిక టీకా కూడా ఇదేనని భారత్ బయోటెక్ వెల్లడించగా.. ఇప్పటికే ప్రికాషనరీ లేదా బూస్టర్ డోసు వేసుకున్న వాళ్లు ఈ నాజల్ వ్యాక్సిన్ తీసుకోకూడదని కేంద్రం నియమించిన వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ హెచ్చరించింది.

ఇక, ఈ నాజల్ వ్యాక్సిన్ ధర విషయానికి వస్తే.. ఈ ఇంకొవాక్ టీకాను ప్రభుత్వానికైతే ఒక్కో డోసుకు రూ.325కి.. ప్రైవేటు ఆస్పత్రులకైతే రూ.800కి భారత్ బయోటెక్ సరఫరా చేయనుంది. ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేట్ రంగాలలో ఈ ధరకి అదనంగా పన్నులు కూడా కలిపి విక్రయాలు జరగనున్నట్లు తెలుస్తుంది.