Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్.. పోలీస్ వాహనాలు ధ్వంసం

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 08:27 AM

Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్.. పోలీస్ వాహనాలు ధ్వంసం

Bandi Sanjay: శుక్రవారం సాయంత్రం నుండి కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్లు కట్టి పోలీసులు భారీ బందోబస్తు చేయగా బీజేపీ కార్యకర్తలు, రైతులు వందల సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు. కామారెడ్డి మునిసిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న రైతులు.. ఇండస్ట్రియల్ జోన్ కు తమ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని వారు స్పష్టం చేస్తున్నారు.

రైతులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా రంగంలోకి దిగడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆయన నిరసనకు దిగారు. కలెక్టర్ తో మాట్లాడేంత వరకు నిరసన వీడేదిలేదంటూ అక్కడే రోడ్డు మీద బైఠాయించారు. అక్కడికి భారీగా చేరుకున్న బీజేపీ కార్యర్తలు బారికేడ్లు ఎక్కి మరీ కలెక్టరేట్ లోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏం జరుగుతుందోనని అంతటా ఉత్కంఠ నెలకొంది. అయితే.. పరిస్థితి చేయి దాటకముందే పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఆయనను పోలీసు వాహనంలోకి ఎక్కించి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బండి సంజయ్ ని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులతో బీజేపి నేతలు, కార్యకర్తలు, రైతులు తీవ్ర వాగ్వాదానికి దిగి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో పోలీసులు బీజేపి కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేస్తూ వారిని చెదరగొట్టారు. చివరకు కార్యకర్తల పెనుగులాట మధ్యే పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి జీపులోకి ఎక్కించారు. ఈ క్రమంలో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట జరగగా.. పోలీసు వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పోలీసు వాహనాలు ధ్వంసం కాగా.. ఆందోళనకారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అరెస్టులతో తమను అడ్డుకోలేరని.. రైతులకు తమ పార్టీ అండగా నిలబడుతుందని బండి సంజయ్ వారికి పార్టీ తరుపున భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.