Unstoppable with NBK: పవన్ ఎపిసోడ్‌లో నోరు జారిన బాలయ్య.. క్షమాపణ చెప్పాలని నర్సుల డిమాండ్

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 04:57 PM

Unstoppable with NBK: పవన్ ఎపిసోడ్‌లో నోరు జారిన బాలయ్య.. క్షమాపణ చెప్పాలని నర్సుల డిమాండ్

Unstoppable with NBK: పాపం బాలయ్య మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మొన్నామధ్య అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్య ఒకటి రచ్చ రచ్చ కాగా.. అక్కినేని అభిమానులు బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్లు చేశారు. అక్కినేని హీరోలు కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. చివరికి తన ఉద్దేశం అది కాదని.. ఫ్లోలో మాట్లాడేశానని బహిరంగ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదలా ఉండాగానే ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.

తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోలో బ్లాస్టింగ్ ఎపిసోడ్ వదిలిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్ అటు మెగా అభిమానులతో పాటు నందమూరి అభిమానులకు పండగలా కనిపించింది. కాగా, ఈ ఎపిసోడ్ లో పవన్‌-బాలకృష్ణ మధ్య సాయిధరమ్ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్బంగా బాలకృష్ణ గతంలో ఒకసారి తనకు జరిగిన యాక్సిడెంట్ ఉదంతాన్నిపవన్‌ కల్యాణ్‌కు వివరించే ప్రయత్నం చేశారు.

కాలేజీ రోజుల్లో తాను కూడా బైక్‌లపై ఎక్కువగా తిరిగేవాడినని.. ఒకసారి రోడ్డు క్రాస్ చేస్తుండగా మరో బైకు వేగంగా వచ్చి కొట్టేసిందన్నారు. దాంతో తాను ఎగిరిపడ్డానని.. ఒళ్లంతా రక్తమేనని వివరించారు. యాక్సిడెంట్ అని చెప్పొద్దని.. జారి పడ్డానని చెప్పమన్న స్నేహితులు తనను ఆస్పత్రికి తీసుకెళ్లారని.. అక్కడ కళ్లు తెరిస్తే ఒళ్ళంతా రక్తం.. ఆ నర్సు దానమ్మ భలే అందంగా ఉంది. అదేమో క్లీన్ చేస్తుంది అని బాలకృష్ణ మాట్లాడారు.

ఇప్పుడు బాలయ్య మాట్లాడిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నారు. బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న ప్రసాద్.. బాలకృష్ణ తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, నర్సులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలా క్షమాపణలు చెప్పకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరి ఈ వివాదంపై బాలయ్య స్పందిస్తారో లేదో చూడాలి.