Viveka Murder Case: నేడు అవినాష్ విచారణ పూర్తి.. రేపు భాస్కర్ రెడ్డి విచారణకు సీబీఐ నోటీసులు!

Viveka Murder Case: తెలంగాణకు బదిలీ అయిన తర్వాత వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో దూకుడు పెరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని మరోమారు విచారించిన సీబీఐ, తాజాగా అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. రేపు శనివారమే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు మరింత హీట్ పెంచేస్తుంది.
నిజానికి ఇప్పటికే ఒకసారి గతంలోనే వైఎస్ భాస్క ర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని సూచించింది.. కానీ, ఈ నెల 23న జరగాల్సిన సీబీఐ విచారణకు హాజరుకాలేనని గతంలో సీబీఐకి భాస్క ర్ రెడ్డి లేఖ రాశారు. దీంతో ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. 25వ తేదీన కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
కాగా, శుక్రవారం ఎంపీ అవినాష్ ను సీబీఐ మరోసారి విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు 4.30 గంటల పాటు అవినాష్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈసారి కూడా అవినాష్ తో వచ్చిన న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. సుదీర్ఘ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి.. సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పానని తెలిపారు. విజయమ్మ వద్దకు వెళ్లి బెదిరించి వచ్చానని దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు.
ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచేందుకు.. ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణ వాస్తవాలను కాకుండా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ జరుగుతోందని ఆరోపించిన అవినాష్.. ఈ కేసులోని వాస్తవాలపై నేను సీబీఐ అధికారులకు ఒక రిప్రజంటేషన్ ఇచ్చానని.. నాకున్న అనుమానాలు ప్రస్తావించానని చెప్పారు.