Viveka Case: సీబీఐ విచారణకు ముందు జగన్ తల్లిని కలిసిన అవినాష్.. రికార్డింగ్, లాయర్ అనుమతికి విన్నపం!

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 01:31 PM

Viveka Case: సీబీఐ విచారణకు ముందు జగన్ తల్లిని కలిసిన అవినాష్.. రికార్డింగ్, లాయర్ అనుమతికి విన్నపం!

Viveka Case: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒకటికి, రెండు సార్లు సీబీఐ నోటీసులు అందుకున్న అవినాష్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లో సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు.

హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి ఆయన వెళ్లేముందు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మను వైఎస్ అవినాశ్ కలిశారు. లోటస్ పాండ్ కు వెళ్లి మరీ ఆమెని సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడిన అవినాష్.. సీబీఐ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ మధ్యాహ్నం కోఠిలోని కార్యాలయంలో విచారణకు హాజరవుతానని మాత్రమే చెప్పారు. అంతకి మించి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన ఎంపీ అవినాష్.. అనంతరం లోటస్ పాండ్ నుంచి వెళ్లిపోయారు.

వివేకా హత్య కేసులో 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. ఇప్పుడు అవినాష్ ను విచారణ చేయనుంది. వివేకా హత్య జరిగిప్పటి నుంచి విపక్షాలు.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రిభాస్కర్ రెడ్డిపైనే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముందుగా అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కోసం ఆరా తీసి.. ఆ తర్వాత అవినాష్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అవినాష్ కూడా విచారణకి హాజరుకానుండడంతో నేడు సీబీఐ విచారణ ఉత్కంఠగా మారింది.

మరోవైపు సీబీఐకి అవినాశ్ రెడ్డి లేఖ రాయడం మరింత ఆసక్తిగా మారింది. వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరగుతున్నాయని లేఖలో ప్రస్తావించిన అవినాష్.. మీడియాలోని ఒక వర్గం పని కట్టుకుని తనపై లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విచారణ పారదర్శకంగా జరగాలని, విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. తనతో పాటు ఒక లాయర్ ను కూడా అనుమతించాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా కనిపిస్తుంది.