Nara Lokesh: లోకేష్ ప్రచార రథాన్ని సీజ్ చేసే ప్రయత్నం.. ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 08:29 PM

Nara Lokesh: లోకేష్ ప్రచార రథాన్ని సీజ్ చేసే ప్రయత్నం.. ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలో ప్రారంభమైన యాత్ర 7వ రోజు పూర్తయింది. ఈ రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరులో జరిగిన పాదయాత్ర పట్టణంలో ఉండగా నారా లోకేశ్ ఒక చోట యాత్రను ఆపి తన ప్రచార రథం పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రథం దిగి ముందుకు వెళ్తుండగా.. ప్రచార రథాన్ని సీజ్ చేస్తున్నట్లు పలమనేరు పోలీసులు ప్రకటించారు.

కేవలం లోకేష్ పాదయాత్రకి మాత్రమే అనుమతి ఉందని.. మైక్‌కు అనుమతి లేదని.. అందుకే సీజ్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ప్రచార రథాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ లోకేశ్‌ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఏ రాజ్యాంగం, ఏం చట్టం ప్రకారం వాహనాన్ని సీజ్‌ చేశారని ఆయన నిలదీశారు.

ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ప్రచార రథం ఎదుటే టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. ఈలోగా కొందరు టీడీపీ నేతలు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి, ఇకపై అనుమతి తీసుకుంటామని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు మీనమేషాలు లెక్కించారు.

చివరికి లోకేశ్‌ నిరసన, టీడీపీ శ్రేణుల తీవ్ర ప్రతిఘటన తర్వాత పోలీసులు ప్రచార రథాన్ని విడిచిపెట్టడంతో ఆయన తిరిగి తన పాదయాత్రను కొనసాగించారు. ఇక ఈరోజు జరిగిన లోకేష్ పాదయాత్రలో ఒకటి హైలెట్ గా నిలిచింది. లోకేశ్ పాదయాత్రకు బీజేపీ నేతలు సైతం సంఘీభావం తెలిపారు. గాంధీనగర్ క్రాస్ వద్ద లోకేశ్ ను బీజేపీ నేతలు కలిశారు. లోకేశ్ ను కలిసిన నేతల్లో బీజేపీ స్టేట్ ఎక్జిక్యూటివ్ మెంబర్ గుత్తా నారాయణస్వామి నాయుడు కూడా ఉన్నారు. దీంతో ఈ కలయిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.