Hyderabad: బార్ ఓనర్‌పై దాడి.. రూ.2 కోట్లు దోచుకెళ్లిన దొంగలు

Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకరకమైన ఆందోళన నెలకొంది. అంతకంతకు క్రైమ్ రేట్ గణనీయంగా పెరుగుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒకవైపు దొంగతనాలు, హత్యలు, యాక్సిడెంట్లు, అత్యాచారాల వంటి ఘటనలు నిత్యకృత్యమవగా.. మరోవైపు డ్రగ్స్ రాకెట్స్ బయటపడుతుండడంతో అసలేం జరుగుతుంది హైదరాబాద్ అన్నది అంతు చిక్కడం లేదు. నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టిన చట్టాలు తీసుకొచ్చి శిక్షలు విధిస్తుంది.
నేరం ఎలాంటిదైనా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుంటున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా నిందితుల్లో మార్పు రావడం లేదు. హైదరాబాద్ నగరంలో ఈ ఒక్క రోజే ఆరు చైన్ స్నాచింగ్స్ జరగడంతో మహిళలు అడుగు బయటపెట్టేందుకు ఒకటి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుంది. అది కూడా రెండు గంటల సమయంలో నగరంలో ఆరు చోట్ల ఈ చోరీకి తెగబడ్డారు. ఇదంతా ఒకే ముఠా పనిగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దొంగలను వేటాడే పనిలో ఉన్నారు.
కాగా, ఇదే భాగ్యనగరంలో మరో భారీ దోపిడీ జరిగింది. రాత్రి బార్ మూసేసి ఇంటికి వెళ్తున్న బార్ ఓనర్ పై దాడి చేసి బెదిరించి రూ.2 కోట్ల రూపాయలను చోరీ చేశారు. వనస్థలిపురంలో ఈ దోపిడీ జరిగింది. బార్ మూసివేసిన యజమాని వెంకట్రామిరెడ్డి ఆరోజు వచ్చిన డబ్బుతో ఇంటికి బయలుదేరాడు. అయితే అతడి దగ్గర డబ్బు ఉందని గుర్తించిన దొంగలు వనస్థలిపురంలో అతడిని అడ్డుకున్నారు. వెంకట్రామిరెడ్డిపై దాడి చేసిన దుండగులు అతని దగ్గరున్న డబ్బును ఎత్తుకెళ్లారు.
ఏకంగా రూ. 2 కోట్ల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాల కోసం కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒకవైపు చైన్ స్నాచింగ్.. మరోవైపు దోపిడీలతో భాగ్యనగర వాసులు భయపడుతున్నారు. దీనికి తోడు గత వారం ఒకటి.. ఈరోజు మరొకటి డ్రగ్స్ ముఠా చిక్కడంతో హైదరాబాద్ క్రైమ్ విషయంలో పోలీసులు మరింత దృష్టి పెట్టాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.