Doctor Car Burnt: ప్రియురాలితో గొడవ.. రూ.70 లక్షల కారు తగలబెట్టేసిన డాక్టర్

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 09:47 PM

Doctor Car Burnt: ప్రియురాలితో గొడవ.. రూ.70 లక్షల కారు తగలబెట్టేసిన డాక్టర్

Doctor Car Burnt: ప్రియురాలితో గొడవపడి ఏకంగా లక్షల విలువచేసే బెంజ్ కారును తగలబెట్టేశాడు ఓ యువ డాక్టర్. తమిళనాడులోని కాంచీపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు రూ.70 లక్షల విలువైన బెంజ్‌ కారు పూర్తిగా కాలిపోయింది. ధర్మపురికి చెందిన కవిన్ గత ఏడాది కాంచీపురంలోని ఓప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు ఆసుప్రతిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. కాలేజీ రోజుల నుండి అదే కాలేజీకి చెందిన కావ్యను ప్రేమించాడు.

అయితే, ఈ ఇద్దరూ మనస్పర్థల కారణంగా గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ప్రియురాలు దూరమైన బాధలో ఆ యువ డాక్టర్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తనతో మాట్లాడాలని కావ్యను తన కారులో ఎక్కించుకుని కాంచీపురం జిల్లాలోని రాజకులంలో సరస్సు సమీపంలోని ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడ కూడా మాటల్లో వారి మధ్య గొడవ మొదలు కావడంతో ఒక్కసారిగా కోపం ఎక్కువైన
డాక్టర్ కవిన్ రూ.70 లక్షల విలువ చేసే తన మెర్సిడెస్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

కవిన్ కారును తగలబెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. కావ్య అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వినలేదు. ఒక్కసారిగా కారు తగలబడిపోతూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. అటుగా వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్ని మాపక సిబ్బందిని ఘటనాస్థలికి తరలించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా వీలుపడలేదు. అప్పటికే కారు దగ్ధమైపోయింది.

ఈ ఘటనపై కాంచీపురం పోలీసులు డాక్టర్ కవిన్ పై కేసు నమోదు చేయగా.. బెయిల్ పై విడుదలయ్యాడని తెలుస్తుంది. కారు దహనం తర్వాత.. ఆ యువతి గురించి దర్యాప్తు చేసిన పోలీసులు సేఫ్ గా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే అతడు కారుకు నిప్పు అంటించుకుని అందులో కూర్చుని ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని.. కానీ పొగ దెబ్బకు ఊపిరాడక పోవడంతో బయటకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.