AP Govt: సలహాదారుల నియామకం ప్రమాదకరం.. హైకోర్టు ఆగ్రహం

Kaburulu

Kaburulu Desk

January 19, 2023 | 10:43 PM

AP Govt: సలహాదారుల నియామకం ప్రమాదకరం.. హైకోర్టు ఆగ్రహం

AP Govt: ఒకప్పుడు ఏపీ రాజకీయాలలో అధికార, ప్రతిపక్షాల మధ్య పాలనా యుద్ధం తలపించేది. కానీ, ఎందుకో ఈ మధ్య కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షంగా ప్రభుత్వ నిర్ణయాలపై యుద్ధం తగ్గించారు. మాటల దాడి చేస్తున్నారు కానీ ప్రభుత్వ నిర్ణయాలు తప్పని నిరూపించే ప్రయత్నం మాత్రం తగ్గించారు. అయితే.. ఆ లోటును మిగతా ప్రతిపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు.. కోర్టులు తీరుస్తున్నాయి.

మొన్నటికి మొన్న ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపైన కమ్యూనిస్ట్ పార్టీలు హైకోర్టుకు వెళ్తే జీవోను తాత్కాలికంగా రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే.. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అదలా ఉండగానే హైకోర్టు ప్రభుత్వం నియమించే సలహాదారులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. అది కూడా ఇలాగే సలహాదారుల నియామకం కొనసాగితే రేపు.. టీఏకి, డీఏకి కూడా సలహాదారులని నియమిస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఏపీలో జగన్ ప్రభుత్వం సలహాదారుల నియామకం వ్యవహారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సలహాదారుల నియామకంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇద్దరు సలహాదారుల నియామకంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకంతో పాటు ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్లు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకొండి కానీ కోర్టు వరకూ తీసుకురావద్దని సూచించింది.

అంతేకాదు, రాజకీయాలను కోర్టు వరకు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మాకు తెలుసని హెచ్చరించింది. హైకోర్టు హెచ్చరికలపై స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం.. నిష్ణాతులైన వారినే సలహదారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. రేపు ఉద్యోగుల టీఏ, డీఏ కోసం కూడా మరో సలహాదారుడిని నియమిస్తారా? అని ప్రశ్నించింది. అంతటితో ఆగని హైకోర్టు ధర్మాసనం ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని వ్యాఖ్యానించింది.