Atchannaidu: తల్లిని, చెల్లిని గెంటేసి సింహాన్ని అంటే ఎలా.. జగన్‌పై అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు!

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 09:35 PM

Atchannaidu: తల్లిని, చెల్లిని గెంటేసి సింహాన్ని అంటే ఎలా.. జగన్‌పై అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు!

Atchannaidu: తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి.. తనకు తాను సింహాన్ని, పులిని అంటూ సినిమా డైలాగులు చెప్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తోడేళ్లన్నీ కలిసివస్తున్నాయని.. కానీ తాను మాత్రం సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేయనున్నట్లు తెలిపారు. భగవంతుని దయతో ప్రజలను నమ్ముకుని ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు జగన్ ప్రసంగించారు.

దీంతో సింహం అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింహం అనే డైలాగులు సినిమాలోనే బాగుంటాయని జగన్ తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు. ఒంటరిగా ఉండటానికి.. వెలివేయడానికి చాలా తేడా ఉందని తెలిపారు. తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి నేను సింహాన్ని సింగల్ గా ఉంటానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

జగన్ వినుకొండ ప్రసంగం చూస్తే.. వెనకటికి ఎవడో తల్లిదండ్రుల్ని చంపేసి, నాకెవరూ లేరు, నాపై జాలి చూపించండి అని జడ్జిని కోరినట్లుందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. చేసిన పాపాలు, పాల్పడిన దారుణాలు, వేసిన భారాలు భరించలేక అందరూ నిన్ను దూరం పెడితే సింగిల్ గా మిగిలావు. ఆ ఒంటరితనం నుండి వచ్చిన ఫ్రష్టేషన్ తో నేను సింహాన్ని, సింగిల్ గా వస్తున్నా అంటూ సినిమా డైలాగులు వాగుతున్నావ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలలో ఒంటరిగా వస్తానని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డీ.. వెళ్లి నీ కబుర్లు నీ వాలంటీర్లకు చెప్పుకుని ఒంటరి పురుష పెన్షన్ కు అప్లై చేసుకో. అంతేగానీ ఇలాంటి దిక్కుమాలిన డైలాగులు విని నిన్ను నమ్మేందుకు ఇంకా ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని తెలుసుకోవాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. నువ్వు చేసే ప్రసంగాలకు, సభలకు రావడానికి ప్రజలు భయపడుతున్నారని.. పోలీసులు అధికారులు లేకపోతే సభలో ఉండేది నువ్వు ఒక్కడివే అంటూ సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు కౌంటర్లు వేశారు.