AP High Court: ఇద్దరు అధికారులకు జైలు శిక్ష.. సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని తీర్పు

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 01:45 PM

AP High Court: ఇద్దరు అధికారులకు జైలు శిక్ష.. సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని తీర్పు

AP High Court: ఏపీలో ఇద్దరు ప్రభుత్వ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు హైకోర్టు ఈ శిక్ష విధిస్తున్నట్టుగా తెలిపింది. ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుడితి రాజశేఖర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణలకు కోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.2 వేల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించింది.

గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో.. ఈతీర్పు ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం వారిద్దరిని అదుపులోకి తీసుకోని.. తుళ్లూరు పోలీసులకు అప్పగించాలని ఎస్పీఎఫ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పు నేపథ్యంలో హుటాహుటిన హైకోర్టుకు చేరుకున్న అధికారులు ఇద్దరూ కోర్టుకు క్షమాపణ చెప్పి వేడుకోవడంతో హైకోర్టు తీర్పును సవరించింది. ముందుగా సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశించిన హైకోర్టు అంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని మరోసారి ఆదేశించింది.

ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ గతంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేయగా.. రామకృష్ణ గతంలో ఇంటర్ బోర్డు కమిషనర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కోర్టు తీర్పును అమలు చేయలేదని వారు అభియోగాలు ఎదుర్కొన్నారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదవగా.. తాజాగా ఈ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. మళ్ళీ కోర్టుకు క్షమాపణలతో తీర్పు సవరించింది.

ఉన్నతాధికారులపై ఆగ్రహించిన హైకోర్టు ఇద్దరికీ జైలు శిక్షతో పాటు అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలివ్వడం సంచలనంగా మారగా.. అంతలోనే అధికారులు కోర్టుకు క్షమాపణలు కోరడం.. తీర్పు సవరించడం మరో సంచలనంగా మారింది. ఇది చాలదని ఐఏఎస్ అధికారులైనా కోర్టులో సాయంత్రం వరకు నిలబడాలని ఇచ్చిన తీర్పు ఆసక్తిగా మారింది. ఐఏఎస్ అయినా.. ఐపీఎస్ అయినా.. సామాన్యుడైనా చట్టం ముందు ఎవరైనా తలవంచాల్సిందే అనే దానికి ఈ తీర్పే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి.