AP Govt: పదవీ విరమణ వయసు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 07:51 PM

AP Govt: పదవీ విరమణ వయసు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

AP Govt: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మరో ఏడాది పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ శాఖలతో పాటు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాలలో ముమ్మర ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లుగా ఉండగా.. మరో ఏడాదికి పెంచే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలలో ప్రచారం జరుగుతుంది.

వయసు పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఆలోచన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు రిటైర్మెంట్ వయసు 62 నుండి 65కు పెంచినట్లు కూడా కొన్ని వార్తలు సర్క్యూలేట్ అయ్యాయి. ఆయా వార్తలపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే 60ఏళ్ల నుంచి 62ఏళ్లకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనిని మరో ఏడాది పెంచాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

గత వారం రోజులుగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రచారం జరుగుతున్నా.. ప్రభుత్వ వర్గాలు వేచి చూసే ధోరణిలో ఉంటూ వచ్చాయి. కానీ.. ఈ ప్రచారం శృతిమించడంతో ఫైనల్ గా ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల సమాఖ్య ఛైర్మన్ వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు ప్రచారంలో ఉన్న జీవో నకిలీదని, ఉద్యోగులెవరూ కూడా ఈ ప్రచారాన్ని నమ్మవద్దని వెంకటరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తప్పుడు వార్తలని సృష్టించిన బాధ్యులపై చర్యలకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వార్తలపై గుంటూరు డీఐజీకీ ఆర్థిక శాఖ అధికారులు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు నమోదు విచారణ జరిపించాలని డీఐజీ ఎస్పీని ఆదేశించారు. మొత్తం ఫేక్ ప్రచారాన్ని నమ్మి ఆశలు పెంచుకున్న ఉద్యోగులు ప్రభుత్వ ఖండింపుతో నిరాశకు లోనవుతున్నారు.