Republic Day 2023: సీఎం జగన్ సాక్షిగా.. మూడు రాజధానుల ప్రస్తావన లేని గవర్నర్ ప్రసంగం

Kaburulu

Kaburulu Desk

January 26, 2023 | 12:19 PM

Republic Day 2023: సీఎం జగన్ సాక్షిగా.. మూడు రాజధానుల ప్రస్తావన లేని గవర్నర్ ప్రసంగం

Republic Day 2023: ఇప్పటికీ మా వైఖరి మూడు రాజధానులే. త్వరలోనే సమయం, సందర్భం చూసి పరిపాలన విశాఖ రాజధాని నుండి మొదలు పెడతాం. త్వరలోనే మరింత సమగ్రంగా మూడు రాజధానులకు సంబంధించి బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. ఇదీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ చెప్తున్న మాట. మరోవైపు ఉగాది నుండి విశాఖ రాజధానిగా కార్యకలాపాలు మొదలవుతాయని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే.. మూడు రాజధానుల ప్రస్తావన లేకుండానే రిపబ్లిక్ వేడుకలలో గవర్నర్ ప్రసంగం కొనసాగింది.

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఏపీ గవర్నర్‌ హరిచందన్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల గౌరవవందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగిస్తూ.. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నవరత్నాలు, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, రైతుల సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాలంటీర్లు, సచివాలయాల సేవల గురించి ప్రస్తావించారు.

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వివిధ శాఖల శకటాలను కూడా పరేడ్లో ప్రదర్శించారు. అయితే, గవర్నర్ ఉపన్యాసంలో ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన లేదు.. జిల్లాల విభజన అంశం వివరణకే పరిమితం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. 2020లో గవర్నర్ తన ప్రసంగంలో పరిపాలనా వికేద్రీకరణ అంశాన్నీ కీలకంగా ప్రస్తావించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండబోతుందని స్పష్టం చేశారు.

ఆ తర్వాత రెండేళ్లలో కూడా ఒక ఏడాది మూడు రాజధానులను కోడ్ చేస్తూ ప్రసంగం సాగించారు. కానీ.. ఈసారి అసలు దాని ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగం ముగిసింది. ప్రసంగం గవర్నరుదే అయినా అందులో ప్రభుత్వ విధానాలను వివరిస్తారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం చెప్పాలనుకున్నది గవర్నర్ ద్వారా చెప్పిస్తారు. అలాంటిది ఇప్పటికీ మూడు రాజధానులే అని చెప్తున్న జగన్ ప్రభుత్వం ఈసారి గవర్నర్ ప్రసంగంలో ఆ ప్రస్తావన లేకపోవడం ఆసక్తిగా మారింది.