MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో మలుపు.. సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

Kaburulu

Kaburulu Desk

February 7, 2023 | 09:02 PM

MLA’s Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో మలుపు.. సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

MLA’s Purchase Case: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ తెలంగాణ ప్రభుత్వం నాటి ఆడియోలు, వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు, న్యాయమూర్తులకు పంపింది.

ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి రాగా.. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్ ను రద్దు చేసిన న్యాయస్థానం.. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సమర్ధిస్తూ.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కూడా కొట్టివేసింది.

హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరుతూ అప్పటి వరకు ఆర్డర్‌ను సస్పెండ్‌లో ఉంచాలని అభ్యర్ధించారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్‌కు కూడా హైకోర్టు నిరాకరించింది. దీంతో సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ధర్మాసనాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే కోరారు. దీంతో వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సీజేఐ చంద్రచూడ్‌ తెలిపారు.

ఇప్పటికే రాజకీయంగా పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేశారు కాబట్టి బుధవారం చీఫ్ జస్టిస్ ముందు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉండదు. ఒక హైకోర్టు నుంచి కేసు సుప్రీంకోర్టుకు చేరింది కాబట్టి ఇక్కడ ఏమి జరగబోతోందో చూడాలి.