AP High Court: హైకోర్టులో మరో షాక్.. కాపు రిజర్వేషన్ అమలుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

AP High Court: కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామజోగయ్య ఈ నెల 6న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది. కాపులు ఆర్ధికంగా నేటికి వెనుకబడి ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది పొలిశెట్టి రాధాకృష్ణ వాదించారు.
ఈ వ్యాజ్యంలో ఈడబ్ల్యూఎస్ కింద కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతం కల్పిస్తూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం రాజకీయ కుట్ర అని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఈడబ్ల్యుఎస్ కోటా కింద కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు లభిస్తే ఆర్ధికంగా బలోపేతం అవుతారని భావిస్తున్నందునే రిజర్వేషన్లను జగన్ సర్కార్ వ్యతిరేకిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది రాధాకృష్ణ చెప్పారు.
కాపులకు రిజర్వేషన్ అడ్డుకోనేందుకే సీఎం జగన్ జీవో 60, జీవో 66లను తీసుకువచ్చారని, కానీ అవి చెల్లుబాటు కాదని ఆయన వాదనలు వినిపించారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ అంశంపై ఇప్పటికే అనే పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని.. తాజాగా దాఖలైన ఈ పిటిషన్ ను కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ కు పంపాలని కోర్టును కోరారు. దానికి హరిరామజోగయ్య తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
103 రాజ్యాంగ సవరణ కింద ఈ రిజర్వేషన్లను చట్టపరంగా తీసుకువచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.