AP Capital: రాజధానిపై సుప్రీంలో మరో పిటిషన్.. మళ్ళీ ఫోకస్ లోకి శ్రీకృష్ణ కమిటీ?

Kaburulu

Kaburulu Desk

January 26, 2023 | 05:33 PM

AP Capital: రాజధానిపై సుప్రీంలో మరో పిటిషన్.. మళ్ళీ ఫోకస్ లోకి శ్రీకృష్ణ కమిటీ?

AP Capital: అదేంటో రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఏపీ రాజధాని అంశం తేలడం లేదు. గత ప్రభుత్వం వేసిన అమరావతి పునాదులను ఎక్కడివక్కడే వదిలేసి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు నినాదం ఎత్తుకోగా.. అది కాస్త ఇప్పుడు కోర్టు వివాదాలలో చిక్కుకుంది. దీంతో ఉన్న రాజధాని ఎదిగే మార్గం లేక.. సీఎం జగన్ చెప్పే మూడు రాజధానులు ఎప్పటికి వస్తాయో తెలియక.. మొత్తానికి రాష్ట్రానికి రాజధాని అంశంలో అతీ గతీ లేకుండా పోయింది.

ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. మరోవైపు ఇదే అంశంలో అమరావతి రైతులు కూడా సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు కలిపి విచారించే అవకాశం ఉందనుకుంటుండగా.. ఈ జనవరి 31న విచారణ జరగనుంది.

ఈ నెలాఖరున తీర్పు ఉందనుకుంటుండగా.. ఇప్పుడు కొత్తగా ఇదే రాజధాని అంశంపై మరో పిటిషన్ కూడా దాఖలైంది. గతంలో ఏపీ రాజధానిపై నియమించిన శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఈ పిటీషన్ దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. మస్తాన్ వలీ పిటీషన్ ను కూడా అమరావతి రాజధాని కేసుతో కలిపి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా, ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని అప్పట్లో శివ రామకృష్ణ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రకాశం జిల్లాను రాజధానిగా పెట్టాలని, లేదంటే గుంటూరు రాజధానిగా చేయాలని అప్పటి కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను ఎలా విచారిస్తుంది? అమరావతి పిటిషన్లలో తీర్పు ఎలా ఉండనుందన్నది ఏపీ ప్రజలలో మరింత ఆసక్తిని కలిగిస్తుంది.