Telangana Govt: నీటిపారుదల శాఖకు సంబంధించి మరో కొత్త చట్టం.. అసెంబ్లీకి ఎప్పుడంటే?

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 02:09 PM

Telangana Govt: నీటిపారుదల శాఖకు సంబంధించి మరో కొత్త చట్టం.. అసెంబ్లీకి ఎప్పుడంటే?

Telangana Govt: తెలంగాణలో నీటి పారుదల శాఖకి సంబంధించి మరో కొత్త చట్టం అమల్లోకి రానుంది. దీనికోసం ఇప్పటికే ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసిన ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలలో.. లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో సభలో ప్రవేశపెట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించి ఉన్న 18 వేర్వేరు చట్టాలను కలిపి ఒక కొత్త సమీకృత నీటిపారుదల చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

ఈ మేరకు ముసాయిదాను కూడా సిద్ధం చేశామని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. ఈ చట్టం గురించి మాట్లాడిన ఆయన.. నిజం కాలంనాటి ఫసలి చట్టం 1935 ఇప్పటికీ అమలులో ఉందని.. ఆ చట్టంలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అనేక అంశాలు లేవని వెల్లడించారు. అలాగే నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణతో పాటు, నీటి నిర్వహణ పద్ధతులు, ఆర్థికపరమైన అధికారాలు, ఆపరేషన్, నీటిపారుదల ఆస్తుల పరిరక్షణకు, నిర్వహణకు, నీటి భద్రత, మెయింటెనెన్స్ నిబంధనలలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని.. అందుకు తగ్గట్లే చట్టాలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

నిబంధనలు లేని పాత చట్టాలను అభివృద్ధి చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ముసాయిదా బిల్లును సిద్ధం చేశామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగంలో సమూలమైన మార్పులు చోటు చేసుకోవడంతో పాటు కొత్తగా ఇంకా మరికొన్ని భారీ మార్పులు కూడా రానుండడంతో.. రక్షణ కోసం కొత్త చట్టం అనివార్యమైందని నీటిపారుదల ప్రత్యేక సిఎస్ రజత్ కుమార్ వెల్లడించారు. నీటిపారుదల శాఖపై ఈఎన్సీ మురళీధర్ తో కలిసి జల సౌధలో సమీక్షలు నిర్వహించిన అనంతరమే ఈ చట్ట రూపకల్పన చేశామని.. ఇది రాష్ట్ర జలవనరుల ప్రయోజనాలే కీలకంగా రూపొందించామని చెప్పారు.