Nellore Politics: అధిష్టానంపై గరంగరం.. త్వరలో బాంబ్ పేల్చనున్న ఆనం?

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 03:51 PM

Nellore Politics: అధిష్టానంపై గరంగరం.. త్వరలో బాంబ్ పేల్చనున్న ఆనం?

Nellore Politics: వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా కీలక నేత ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. బహిరంగ సభలపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు. ఆనం ఎక్కడకి వెళ్లినా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కొన్నాళ్ల పాటు వేచి చూసిన పార్టీ పెద్దలు ఇక లాభం లేదని చర్యలకు కూడా పూనుకుంది.

ఈ మధ్యనే అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి వెంకటగిరి ఇంచార్జిగా ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. అప్పటి నుండి బహిరంగంగా ఎక్కడా పెద్దగా మాట్లాడని ఆనం.. ప్రభుత్వం తలపెట్టిన గడపగడపకు వైసీపీ కార్యక్రమానికి హాజరవుతూ కార్యకర్తలతో మమేకమవుతున్నారు.

అయితే.. మరోసారి వైసీపీ అధిష్టానం ఆనంకు షాక్ ఇచ్చింది. ‘గడపగడపకు’ కార్యక్రమంలో ఇప్పటివరకు అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలు అంటూ ఎమ్మెల్యే ఆనంకు జీఎస్ డబ్ల్యూఎస్ కమిషనర్ మెసేజ్ పంపారు. ఇది గౌరవ ప్రదమైన మెసేజ్ గానే కనిపిస్తున్నా దీని వెనక చాలా అర్థముంది. ఇకపై మీరు గడపగడపకి రావద్దని పరోక్షంగా ఇలా మెసేజ్ పంపినట్లుగా కనిపిస్తుంది.

దీంతో ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తమను పక్కకు పెట్టడంపై రగిలిపోతున్న ఆనం.. చెప్పాల్సింది చాలా ఉందన్నారు. ఇప్పటికే సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్న ఆనం.. అవమానాలు భరిస్తూ వైసీపీలో ఉండలేమని ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఛాన్స్‌ ఉందని ఉమ్మడి జిల్లాలో గట్టి ప్రచారం జరుగుతుంది. మహా అయితే ఓ వారం రోజులలోనే ఆనం నుండి సంచలన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.