Tamilisai Soundararajan: కొందరికి నేను నచ్చకపోవచ్చు కానీ.. గవర్నర్ తమిళిసై ఎమోషనల్ వ్యాఖ్యలు

Kaburulu

Kaburulu Desk

January 26, 2023 | 09:16 AM

Tamilisai Soundararajan: కొందరికి నేను నచ్చకపోవచ్చు కానీ.. గవర్నర్ తమిళిసై ఎమోషనల్ వ్యాఖ్యలు

Tamilisai Soundararajan: హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి గణతంత్ర వేడుకలకు హాజరు కాగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని ప్రశంసించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు.

ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్రమని.., ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి అని తమిళిసై వ్యాఖ్యనించారు. ఇక, తెలంగాణ విషయానికి వస్తే విశిష్టమైన చరిత్ర కలిగిన రాష్ట్రమని.. తెలంగాణ అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుదని చెప్పారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందన్న గవర్నర్.. వైద్యం, ఐటీ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందన్నారు.

ఇక, ఈ ప్రసంగంలో గవర్నర్ తమిళిసై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కొందరికి తాను నచ్చకపోయినా.. తెలంగాణ వాళ్లు అంటే తనకు ఇష్టమని అన్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదని.. నేషనల్ బిల్డింగ్‌ను అభివృద్ధి అంటారని గుర్తు చేశారు. ఫామ్ హౌస్‌లు కట్టడం, మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదని అన్నారు. రాష్ట్ర విద్యాలయాల్లోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండాలని అన్నారు.

తెలంగాణతో తనకున్నది మూడేళ్ల అనుబంధం మాత్రమే కాదని, పుట్టుకనుంచే ఉందని అన్నారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చు కానీ.. తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వేడుకలు జరపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసినా పట్టించుకోలేదు. ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే జరిగిన ఈ వేడుకలకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.