Hero Balakrishna: పుసుకున్న నోరు జారిన బాలయ్య.. సీరియస్ అయిన అక్కినేని హీరోలు!

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 04:25 PM

Hero Balakrishna: పుసుకున్న నోరు జారిన బాలయ్య.. సీరియస్ అయిన అక్కినేని హీరోలు!

Hero Balakrishna: సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. అది రాజకీయ సభ అయినా.. సినీ వేడుకైనా ప్రసంగాలు తనదైన శైలి ఉంటుంది. యాదృచ్ఛికమో, కాకతాళీయమో అంటూ పురాణాలు, ఇతిహాసాల సంగతుల నుండి వారి తండ్రి మాజీ సీఎం ఎన్టీఆర్ సమయంలో సంగతులు, ఇప్పటి సంగతులు అన్నీ కలగలిపి మాట్లాడుతూ ఉంటారు. సినిమాలలో పవర్ ఫుల్ డైలాగులు చెప్పే బాలయ్య స్టేజ్ ఎక్కితే ఎందుకో ఇప్పటికీ అనర్గళంగా మాట్లాడలేరు.

బాలయ్య మాట్లాడేది టార్గెట్ చేసి కాకపోయినా ఒక్కోసారి అది పెడర్ధాలుగా మారి వివాదాస్పదం అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో బాలయ్య నుండి ఇలాంటివి లేకపోగా ఇప్పుడు మాత్రం ఒకటి వివాదాస్పదంగా మారింది. ఓ వేడుకలో అక్కినేని, తొక్కినేని అంటూ బాలయ్య పుసుక్కున నోరు జారడంతో అక్కినేని హీరోలు సీరియస్ అయ్యారు. బాలయ్య సమకాలీన అక్కినేని హీరో నాగార్జున దీనిపై ఇంకా స్పందించలేదు కానీ నాగ చైతన్య, అఖిల్ మాత్రం స్పందించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహా రెడ్డి. ఈ సినిమాతో బాలకృష్ణ మరోసారి సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ.. వేదికపై ఉన్న జయరాం అనే ఆర్టిస్ట్‌ గురించి చెబుతూ ‘ఇక ఈయన ఉన్నారంటే సెట్‌లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకుంటుండే వాళ్లం’ అంటూ పుసుక్కున నోరు జారిపోయారు.

బాలయ్య అన్న మాటలను కొందరు కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా అక్కినేని హీరోలు కూడా బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. ‘నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అలాగే ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరచుకోవడం’ అంటూ అక్కినేని నాగచైతన్య ట్వీట్ చేశారు. అటు అఖిల్ అక్కినేని కూడా సేమ్ టు సేమ్ ఇదే ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.