Telangana Assembly Sessions: అక్బరుద్దీన్ vs కేటీఆర్.. అసెంబ్లీలో అరుపులు, కేకలు!

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 02:53 PM

Telangana Assembly Sessions: అక్బరుద్దీన్ vs కేటీఆర్.. అసెంబ్లీలో అరుపులు, కేకలు!

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్ధం చెలరేగింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అక్బరుద్దీన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు.

అంతేకాదు, చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందంటే ప్రజలకు ఏం చెప్పాలి?.. పాతబస్తీ మెట్రో ఏమైంది? అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు జరుగుతున్నాయని, నాలుగున్నరేళ్ళలో కేవలం 64 రోజుల పాటు మాత్రమే సభ జరిగిందని.. ఇంత తక్కువ రోజులు బడ్జెట్ సమావేశాలు జరగడం చరిత్రలోనే మొదటిసారని వాదించారు. కలవాలంటే కనీసం మంత్రులు కూడా అసలు అందుబాటులో ఉండరని ఆరోపించారు.

గతంలో టీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నొట్ల రద్దు, జీఎస్టీ అంశాల్లో మద్దతు వద్దని సూచించినా వినలేదని, సీఎం కేసీఆర్ ఏమి కాదు.. అంతా మంచి జరుగుతుందని చెప్పారని.. తాము ప్రధానిని విమర్శిస్తే అలా అనటం సరికాదని కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేసిన అక్బర్.. ఇప్పుడు బీజేపీ వలన రాష్ట్రానికి ఏం వచ్చిందని అక్బర్ ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు బీజేపీపై పోరాటం చేస్తుందని ప్రశ్నించారు.

దీనికి మంత్రి కేటీఆర్ కూడా ఓ రేంజిలో కౌంటర్లు ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు బీఏసీ సమావేశానికే రారని.. బీఏసీకి రాకపోగా ఏదేదో మాట్లాడితే ఎలా..? అని మంత్రి ప్రశ్నించారు. గొంతు చించుకుని పెద్దగా మాట్లాడితే ఏం లాభం ఉండదని కేటీఆర్‌ అన్నారు. మంత్రులు అందుబాటులో లేరని అనడం కూడా భావ్యం కాదన్న కేటీఆర్.. అసెంబ్లీ తక్కువ రోజులు అంటున్నారు. కానీ, రెండేళ్ల కొవిడ్ ను మరచిపోయారని చెప్పారు.

కేటీఆర్ కామెంట్స్ కు మళ్ళీ అక్బరుద్దీన్ సమాధానంగా.. పెద్దగా అరుస్తూనే తానేమీ కొత్త సభ్యున్ని కాదని, మీకు సహనం తక్కువవుతోందని విమర్శాత్మక కామెంట్స్ చేశారు. పొగిడితే మాత్రం ఎంత సేపైనా ఏమీ అనరని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కల్పించుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. అక్బర్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడితే బాగుంటుందని.. మీకే సహనం తగ్గి, కోపం వస్తోందని కామెంట్స్ చేశారు.