V.V.Lakshmi Narayana: దూకుడు పెంచిన మాజీ జేడీ.. విశాఖపై ఫోకస్

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 01:54 PM

V.V.Lakshmi Narayana: దూకుడు పెంచిన మాజీ జేడీ.. విశాఖపై ఫోకస్

V.V.Lakshmi Narayana: వీవీ లక్ష్మి నారాయణ.. ఇలా చెప్తే ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అంటే మాత్రం తెలుగు ప్రజలు ఈజీగా గుర్తు పట్టేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సీబీఐ అధికారి రిటైర్మెంట్ తర్వాత ప్రజా సమస్యలు.. రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినా ఈయన ఇప్పుడు మరోసారి దూకుడు పెంచారు.

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ విశాఖ నుంచే పోటీ చేస్తానని ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం తేల్చలేదు. 2019 ఎన్నికల్లో ఓడినా పోటీచేసిన విశాఖను మాత్రం వీడని ఆయన.. అప్పటి నుంచి విశాఖలోనే జేడీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మళ్ళీ అక్కడే పోటీ చేసి తిరిగి గెలవాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోండగా ఈ మధ్యనే ఆయన మనసులో మాట కూడా అదేనని చెప్పేశారు.

కాగా.. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా ఏపీలో రాజకీయ పార్టీలన్నీ హైపర్ యాక్టివ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ జేడీ కూడా దూకుడు పెంచినట్లు కనిపిస్తుంది. తాజాగా స్థానిక మందుల ఫ్యాక్టరీ కాలుష్యం విషయంలో జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపారు. మందుల ఫ్యాక్టరీ కాలుష్యానికి వ్యతిరేకంగా మత్స్యకారులు ఏడాదికిపైగా పోరాడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం అనకాపల్లి జిల్లా రాజయ్యపేట సమీపంలో మత్స్యకారులు దీక్షకు దిగారు. ఈ శిబిరాన్ని లక్ష్మీనారాయణ సందర్శించి సంఘీభావం తెలియజేశారు. సమస్యను కేంద్రంలో ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తాను చూసుకుంటానని మత్స్యకారులకు హామీ ఇచ్చారు.

ఈ సమస్యపై గ్రీన్ ట్రైబ్యునల్‌ రూ.7 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలిచ్చింది. కానీ.. ఫ్యాక్టరీ ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. అందుకే దీక్షకు దిగగా వారికీ లక్ష్మీనారాయణ సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ దిగిరాకపోతే కోర్టులో పిల్ దాఖలు చేస్తామని మాజీ జేడీ హెచ్చరించారు. ఇక వచ్చే ఎన్నికల్లో తన ఆశయాలు, ఆలోచనలకు దగ్గరగా ఉన్న పార్టీ నుండి కానీ స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని కూడా మరోసారి చెప్పారు. లక్ష్మీనారాయణ ఇలా ప్రజలతో కలిసి పోరాడడం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ అవుతుంది.