Site icon Kaburulu

Bangladesh Bus Accident: బంగ్లాదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తుక్కు తుక్కైన బస్సు.. 17 మంది మృతి!

Bangladesh Bus Accident: బంగ్లాదేశ్‌లో ఘోర బస్పు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనున్న కాలువలోకి చొచ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా 30 మందికిపైగా గాయపడ్డారు. బంగ్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వెళ్తోండగా ఈ ప్రమాదం జరిగింది.

సోనాదంగా నుంచి ఢాకాకు ఈ బస్సు బయల్దేరింది. ఉదయం 7.30 సమయంలో మదారిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌ వేపై అదుపుతప్పి కాలువలోకి వేగంగా దూసుకెళ్లింది. కాలువ గోడను ఢీకొని ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానిక ప్రజలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

బస్సు గోడను బలంగా ఢీకొట్టి కాలువలోకి పడిపోవడంతో బస్సు తుక్కు తుక్కయింది. ఈ ఘటనలో మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు వేగానికి టైర్ పగిలిపోయి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల 17 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

గాయపడిన వారిని సమీపంలోని వివిధ వైద్యశాలలకు తరలించినట్లు అధికారులు వెల్లడించగా మృతులు, క్షతగాత్రులను గుర్తించాల్సి ఉందన్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ తో పాటు మెకానికల్ వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ లో పాత రోడ్లతోపాటు వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉండటం, సరైన శిక్షణ లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.

Exit mobile version