Kadapa Accident: ఆగివున్న లారీని ఢీ కొట్టిన టెంపో వాహనం.. ముగ్గురు అక్కడికక్కడే

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 09:17 AM

Kadapa Accident: ఆగివున్న లారీని ఢీ కొట్టిన టెంపో వాహనం.. ముగ్గురు అక్కడికక్కడే

Kadapa Accident: కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని చాపాడు మండలం వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

ప్రొద్దుటూరు వైఎమ్మార్ కాలనికి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను అనూష, ఓబులమ్మ, రామలక్షమ్మగా పోలీసులు గుర్తించగా.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమల నుండి ప్రొద్దుటూరు వైపు వెళ్తుండగా.. చక్రానికి గాలి తక్కు వగా ఉందని ఆపే క్రమంలో నిద్రమత్తులో ఉన్న డైవర్ ఆగివున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందగా.. గాయపడిన వారిలో అనంతపురం, హైదరాబాద్‌లకు చెందిన బంధువులు ఉన్నట్లు తెలుస్తుంది. మృతులలో రామలక్ష్మి, ఓబులమ్మ అక్క చెల్లెళ్లు కాగా.. అనూష రామలక్ష్మి కుమార్తెగా చెప్తున్నారు.

మరో 20 నిమిషాలలో ఇంటికి చేరుకుంటామన్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విషాదం. ప్రమాదం జరిగిన చాపాడు గ్రామంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడగా.. ప్రమాదంలో చనిపోయిన వారి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ముగ్గురు అక్క చెల్లెల్లు, కూతురు కావడం.. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లడం వైఎమ్మార్ కాలనిలో విషాదం అలుముకుంది.