Viveka Murder Case: వివేకా హత్యకేసులో వెలుగులోకి కొత్తపేరు.. ఇంతకీ ఎవరీ నవీన్?

Viveka Murder Case: మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. ఒకటికి రెండుసార్లు నోటీసులు ఇచ్చిన అనంతరం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ విచారణకి వెళ్లారు. అవినాష్ అడిగినట్లుగా తనతోపాటు లాయర్ ను సీబీఐ అనుమతించలేదు. అయితే, ఈ విచారణలో జరిగిన కొన్ని విషయాలు మీడియాలో బయటపడ్డాయి.
అవినాష్ విచారణలో తన కాల్ డేటా ఆధారంగా కూడా విచారణ జరిగినట్లు తెలుస్తుంది. కాగా.. ఈ కాల్ డేటాలో నవీన్ అంటే కొత్త పేరు బయటకి వచ్చింది. అవినాష్ ఎక్కువసార్లు ఈ వ్యక్తికి కాల్ చేయడంతో పాటు నవీన్ అని వ్యక్తికి అధికారికంగా మరో పేరు ఉండడంతో సీబీఐ అధికారులు అతని ప్రొఫైల్ వెరిఫై చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, అసలు ఎవరీ నవీన్.. అవినాష్ అతనికి పదేపదే ఎందుకు కాల్ చేశారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
అయితే, నవీన్ అనే వ్యక్తి గురించి స్పందించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి.. అసలు సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి, సీబీఐ అధికారులే ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయాలు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవీన్ ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో పదిహేనేళ్లుగా వ్యక్తిగత సిబ్బందిగా పని చేస్తున్నారని.. తానూ ఎప్పుడైనా జగన్ ఇంట్లో భారతమ్మతో మాట్లాడాలన్నా.. వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ విషయాలు తెలుసుకోవాలన్నా నవీన్‌కు ఫోన్ చేస్తానని చెప్పారు.
కాగా, నవీన్ విషయానికి వస్తే.. పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో నివాసముండే నవీన్ కుటుంబం.. సీఎం జగన్ తాత అయినటువంటి రాజారెడ్డి దగ్గర పని చేసినట్లుగా సమాచారం. నవీన్ చదువుకునే సమయంలోనే జగన్‌కు దగ్గరై బెంగుళూరు, హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఆయన దగ్గరే పని చేయగా.. ప్రస్తుతం తాడేపల్లిలో సీఎం జగన్ నివాసంలోనే ఉంటూ వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా వివేకా హత్యకేసు దర్యాప్తులో ఏ పేరు వినిపించినా సంచలనంగా మారడం విశేషం.