AP Capital: సీఎం జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టుకు లేఖ రాసిన న్యాయవాది

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 03:36 PM

AP Capital: సీఎం జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టుకు లేఖ రాసిన న్యాయవాది

AP Capital: ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ ఏ మాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. విశాఖకు పరిపాలన తరలించాలని కంకణం కట్టుకున్నట్లే ఉన్నారు. మూడు రాజధానులు తమ పార్టీ విధానమని చెప్తున్న వైసీపీ నేతలు త్వరలోనే విశాఖకు పరిపాలన తరలిస్తామని చెప్తుండగా.. ఈ మధ్యనే సీఎం జగన్మోహన్ రెడ్డే స్వయంగా ఇదే విషయాన్ని మరింత క్లారిటీతో చెప్పారు. ఏపీకి రాజధాని విశాఖనే అని.. సీఎంగా ఈ మాట చెప్తున్నా అంటూ ధీమాగా చెప్పారు.

సరిగ్గా ఇప్పుడు సీఎం జగన్ చేసిన ఆ ప్రకటనే వివాదాస్పదంగా మారింది. కోర్టులో ఉన్న అంశంపై ముఖ్యమంత్రి ఎలా డిక్లేర్ చేసి చెప్తారని.. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రాజధాని అమరావతిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడ ఇంకా తీర్పు రాలేదు.. ఈలోగా సీఎం ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

కాగా, ఇప్పుడు ఇదే విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ న్యాయవాది లేఖ రాశారు. త్వరలో విశాఖ ఏపీ రాజధాని కాబోతోందని ప్రకటించడం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఏపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పేర్కొంటున్నారు. విశాఖ రాజధాని అని ప్రకటించడం ద్వారా ఏపీ సీఎం జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనీ, జగన్ పై సుమోటాగా చర్యలు తీసుకోవాలని ఆయన సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

న్యాయస్థాన ధిక్కార చట్టం 1971లోని సెక్షన్‌ 2(సీ)ను సీఎం జగన్ ఉల్లంఘించినట్టేనని లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ద్వారా సుప్రీంకోర్టు అధికారాన్ని జగన్‌ ఉల్లంఘించారనే విషయం అర్థమవుతోందని ఆయన చెప్పారు. ఇప్పటికే రాజధాని అంశంలో రకరకాల కేసులు, పిటిషన్లు కోర్టులలో ఉండగా.. ఇప్పుడు జగన్ కోర్టు ధిక్కరణపై రాసిన లేఖపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.