Green Challenge: హరితహారం పేరుతో భారీ కుంభకోణం.. ఈడీకి ఫిర్యాదులు!

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 03:35 PM

Green Challenge: హరితహారం పేరుతో భారీ కుంభకోణం.. ఈడీకి ఫిర్యాదులు!

Green Challenge: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన కార్యక్రమాలలో హరిత హారం కూడా ఒకటి. సీఎం కేసీఆర్ 3 జూలై 2015న చిలుకూరు బాలాజీ దేవాలయంలో రూ.550 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించగా.. అప్పటి నుంచి ఊరు ఊరునా.. వాడ వాడనా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. పల్లెల నుండి నగరాల వరకు కొంతమేర ఈ కార్యక్రమం తర్వాత పచ్చదనం పెరిగింది.

ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కు బంధువైన ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని కోసం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు నటీనటులతో పాటు వివిధ రంగాలలో బిగ్ సెలబ్రిటీలను కూడా రంగంలోకి దింపి ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ హరిత హారం పేరుతో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ నేత బ‌క్కా జ‌డ్స‌న్ ఈడీకి ఫిర్యాదు చేశారు.

తెలంగాణ ప్ర‌భుత్వంపై నిత్యం పోరాడే కాంగ్రెస్ నేత బ‌క్కా జ‌డ్స‌న్ ఇప్పటికే కాళేశ్వ‌రం, డ్ర‌గ్స్, లైగ‌ర్ కుంభ‌కోణాల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరో కుంభకోణం అంటూ బాంబ్ పేల్చారు. హరితహారంలో భారీ స్కామ్ జరిగిందని ఢిల్లీ వెళ్లి మరీ ఈడీకి రాత‌పూర్వ‌క ఫిర్యాదు చేశారు. కొన్ని ఆధారాల‌ను కూడా అంద‌జేసినట్లుగా చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వ న‌ర్సరీల్లో మొక్క‌లు లేవ‌ని చెబుతూ బ‌య‌ట అత్య‌ధిక రేటుకు మొక్క‌ల‌ను కొనుగోలు చేసినట్లుగా బిల్లులు చేసుకున్నారన్నది ఈయన ఆరోపణ. ఈ వ్య‌వ‌హారంలో ఎంపీ సంతోష్ ప్రధాన సూత్ర‌ధారిగా ఉన్నార‌ని ఆరోపిస్తూ ఈడీకి ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ ఈడీ అన్నట్లుగా పలు కేసులు సాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వంలోని కొందరు బడా నేతల వ్యాపారాలు, సంస్థలపై కూడా ఈడీ ఇప్పటికే ఫోకస్ చేసి ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇలా మరో అంశంపై ఈడీకి ఫిర్యాదు అందితే వదిలే ప్రసక్తే ఉండదు. కానుక రానున్న రోజులలో అధికార-ప్రతిపక్షాల మధ్య యుద్దానికి ఇదే అంశంగా మారే ఛాన్స్ కనిపిస్తుంది. అక్రమాలు జరిగాయా లేదా అన్నది తేలుతుందో లేదో కానీ.. రాజకీయ ఆరోపణలకు.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకొనేందుకు మాత్రం ఇది బాగానే ఉపయోగపడనుంది.