BRS Party: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. తుమ్మలని లైట్ తీసుకుంటారా? పైకి తెస్తారా?

Kaburulu

Kaburulu Desk

January 15, 2023 | 11:10 PM

BRS Party: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. తుమ్మలని లైట్ తీసుకుంటారా? పైకి తెస్తారా?

BRS Party: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ నేతలు ఎవరికి వారే అన్న తీరులో శిబిరాలు నిర్వహిస్తుంటే.. పార్టీ అధిష్టానం మాత్రం ఎవరికి వారే అవసరం అన్నట్లు అందరినీ దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు బహిర్గతం కాగా.. తాజాగా జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఇది కాస్తా బట్టబయలైంది.

నూతన సంవత్సర వేడుకలలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఎవరికి వారు శిబిరాలు, ఈవెంట్లు నిర్వహించి తమ బలగాన్ని చాటే ప్రయత్నం చేయగా.. పార్టీ అధిష్టానం మాత్రం వేచి చూసే ధోరణిలోనే సమయం కోసం వేచి చూస్తుంది. అయితే.. వీరిలో మాజీ మంత్రి తుమ్మల.. మాజీ ఎంపీ పొంగులేటి విషయంలో పార్టీ దోబూచులాట జిల్లా రాజకీయాలలో గందరగోళం సృష్టిస్తుంది.

ఎందుకంటే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తనకు గౌరవం లేని చోట ఉండలేనని ఇప్పటికే ప్రకటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇప్పటికే బీజేపీలోకి వెళ్లేందుకు తన అనుచరులు, క్యాడర్‌ను రెడీ చేసుకుంటున్నట్లు వినిపిస్తుంది. ఇందుకు బీఆర్ఎస్ కూడా దాదాపుగా సిద్ధపడినట్టే కనిపిస్తోంది. ఈ నెల 18న బీఆర్ఎస్ ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది.

ఈ సభ నేపథ్యంలో ఇక్కడ కీలకంగా ఉన్న పొంగులేటి, తుమ్మలను వదులుకుంటుందా? దగ్గర చేసుకుంటుందా అనే చర్చ మొదలైంది. ఒకవేళ పొంగులేటిని వదులుకుంటే తుమ్మలని దగ్గర చేసుకుంటారా అనే చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా తుమ్మల విషయంలో కూడా అధిష్టానం ఇక్కడ కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లే వ్యవహరిస్తోంది. ఈ మధ్యనే కేసీఆర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఖమ్మం వచ్చిన మంత్రి హరీశ్ రావు స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లి భోజనం చేశారు. ఆయనతో కొంతసేపు ఏకాంతంగా మాట్లాడారు.

ఇక, కొత్తగూడెం కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన కేసీఆర్ కూడా తుమ్మలను వెంటబెట్టుకుని తిరిగారు. అయినా తుమ్మల మాత్రం ఏమంత యాక్టివ్ గా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్‌పై తుమ్మల ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే.. ఈనెల 18 సభ తర్వాత పొంగులేటి పార్టీ మార్పు జరుగనుందా? లేదా తుమ్మల, పొంగులేటికి ఎవరికి వారికే పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుందా? ముఖ్యంగా సీనియర్ నేత తుమ్మలను మరింత దగ్గర చేసుకుంటుందా అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.