Gangasagar Pilgrims: పుణ్యస్నానాలు వెళ్లి.. సముద్రంలో చిక్కుకున్న 600 మంది భక్తులు

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 07:56 AM

Gangasagar Pilgrims: పుణ్యస్నానాలు వెళ్లి.. సముద్రంలో చిక్కుకున్న 600 మంది భక్తులు

Gangasagar Pilgrims: సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానానికి వెళ్లిన యాత్రికులు సముద్రంలో చిక్కుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సముద్రంలో దాదాపు 600 మంది గంగాసాగర్ యాత్రికులు చిక్కుకున్నారు. వారు గత రాత్రి నుంచి సముద్రంలోనే ఉన్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా హుగ్లీ నది బంగాళాఖాతంలో సంగమించే గంగాసాగర్‌లో పెద్ద సంఖ్యలో యాత్రికులు పవిత్ర స్నానం ఆచరిస్తుంటారు.

ప్రతి ఏడాది లాగానే ఈ మకర సంక్రాంతి రోజున యాత్రికులు ఆదివారం సాయంత్రం 24 పరగణాల జిల్లా వద్ద గంగాసాగర్‌కు వెళుతుండగా సముద్రంలో ఆటుపోట్లు, దట్టమైన పొగమంచు కారణంగా వారి పడవలు కక్‌ద్వీప్ సమీపంలో సముద్రంలో చిక్కుకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పశ్చిమ బెంగాల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకుపోయిన యాత్రికులను రక్షించేందుకు ఇండియన్ కోస్టు గార్డు రెండు హోవర్‌క్రాఫ్ట్‌లను మోహరించింది.

యాత్రికులు రాత్రి మొత్తం సముద్రంలోనే గడపాల్సి రాగా.. ఉదయం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోస్ట్ గార్డు సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు మొదలుపెట్టారు. అయితే యాత్రికులందరూ సురక్షితంగానే ఉన్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. రెస్క్యూ ఆపరేషన్ టీమ్ యాత్రికుల కోసం ఆహారంతోపాటు మంచి నీరు కూడా తీసుకెళ్లగా.. పొగమంచు కారణంగా గంగాసాగర్‌ నుంచి యాత్రికులను తీసుకురావడంలో కాస్త అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.

కాగా, మకర సంక్రాంతి సందర్భంగా గంగాసాగర్‌లో దాదాపు 10 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. దాదాపు 51 లక్షల మంది గంగాసాగర్‌ను సందర్శించి పూజలు చేశారు. ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తే శుభపరిణామని విశ్వసిస్తారు. ఈ భక్తులు కూడా అలాగే గంగాసాగర్ కు బయల్దేరారు. అయితే, అనుకూలించని వాతావరణం.. పొగమంచు కారణంగా ఫెర్రీలు ముందుకు కదలకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. రాత్రి సమయం కావడంతో రాత్రంతా ఫెర్రీలలోనే గడపాల్సి వచ్చింది. మొత్తంగా ఇప్పుడు సురక్షితంగా ఒడ్డుకి చేరుకుంటున్నారు.