Chain Snatching: 2 గంటల్లో 6 చైన్ స్నాచింగ్.. హడలెత్తిన హైదరాబాదీలు

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 02:57 PM

Chain Snatching: 2 గంటల్లో 6 చైన్ స్నాచింగ్.. హడలెత్తిన హైదరాబాదీలు

Chain Snatching: హైదరాబాద్ లో ఒకవైపు చైన్ స్నాచర్లు.. మరోవైపు దొంగలు హడలెత్తించారు. జస్ట్ రెండు గంటల సమయంలో ఏకంగా ఆరు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడి ప్రజలను భయకంపితులను చేశారు. ఆ మధ్య వచ్చిన అజిత్ వలిమై సినిమాలో మాదిరి బైక్ లపై వచ్చిన దొంగలు.. మహిళల మెడల్లోని గొలుసులను లాక్కొని పరారయ్యారు. ఉప్పల్ లో మొదలైన ఈ చైన్ స్నాచింగ్ లు సికింద్రాబాద్ వరకూ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

అచ్చం వలిమై సినిమా మాదిరే దుండగులు ముఖాలు కనిపించకుండా మాస్క్ లు ధరించి స్నాచింగ్ లకు పాల్పడటంతో పోలీసులు వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ స్నాచింగ్ లకు పాల్పడింది ఒక ముఠాకు చెందినవారే కావొచ్చని.. వారిని పట్టుకునేందుకు 12 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో ఉదయం 6:20 నిమిషాలకు మొదలైన ఈ స్నాచింగ్.. రాంగోపాల్ పేట్ పరిధిలో ఉదయం 8:10 వరకు కొనసాగాయి.

ఉప్పల్ లో మొదట ఓ మహిళ మెడలో నుంచి దుండగులు గోల్డ్ చైన్ లాక్కెళ్లగా.. ఆ తర్వాత కల్యాణపురిలో వాకింగ్ కు వెళుతున్న మరో మహిళ మెడలోని మంగళసూత్రాన్ని చోరీ చేశారు. నాచారంలోని నాగేంద్రనగర్‌, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్‌, చిలకలగూడ రామాలయం వీధిలో, రాంగోపాల్ పేట్‌ పరిధిలో దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఉప్పల్ లోని రాజధాని కాలనీలో ఉదయం 6:20 గంటలకు మొదటి స్నాచింగ్ ఘటన జరిగింది.

ఆ తర్వాత కల్యాణ్ పురిలో ఉదయం 6:40 గంటలకు రెండో ఘటన, నాచారంలోని నాగేంద్రన్ కాలనీలో ఉదయం 7:10 గంటలకు మూడో చోరీ, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్ లో ఉదయం 7:40 గంటలకు నాలుగో ఘటన, చిలకలగూడ రామాలయం వీధిలో ఉదయం 8 గంటలకు ఐదో చోరీ, రాంగోపాల్ పేట్ పరిధిలో ఉదయం 8:10 గంటలకు ఆరో ఘటన చోటుచేసుకున్నాయి.